మారుతున్న కరణం పాలిటిక్స్.. ఏం జరుగుతోంది ..!
చీరాల రాజకీయాలు మారుతున్నాయా? వైసీపీ నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
By: Tupaki Desk | 21 Jun 2025 7:00 AM ISTచీరాల రాజకీయాలు మారుతున్నాయా? వైసీపీ నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి వచ్చిన కరణం బలరామకృష్ణ మూర్తి ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ఇప్పుడు యాక్టివ్గా లేకపోవడం వైసీపీ తరఫున కనీసం స్పందించకపోవడం వంటివి చర్చగా మారింది. కొన్ని రోజుల కిందట జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. పొదిలి మార్కెట్ యార్డ్ లో రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చాలామంది వచ్చినా కరణం కుటుంబం మాత్రం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం జగన్ను కనీసం పలకరించకపోవడం గమనార్హం.
రాజకీయంగా వారు తమ దారి తాము చూసుకుంటున్నారనే సంకేతాలను ఇచ్చినట్టైంది. వాస్తవానికి టిడిపితో అనుబంధం ఉన్న కరణం కుటుంబం అని వార్య కారణాలవల్లే 2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి వచ్చిందన్న ప్రచారం జరిగింది. వారిపై ఉన్న కేసులు కావచ్చు, రాజకీయంగా వారు చేసిన పనుల వలన వైసీపీ ప్రభుత్వం తమపై ఎక్కడ కేసులు పెడుతుందో అన్న భయంతోనే రాజకీయంగా కరణం ఫ్యామిలీ వైసిపి లోకి వచ్చిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఇవేవీ పట్టించుకోకుండా కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ఉద్దేశంతో వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
తద్వారా అప్పటికే వైసీపీలో ఉన్న కీలక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో కరణం కుటుంబానికే ఈ టికెట్టు కేటాయించారు. నిజానికి ఆమంచి కృష్ణమోహన్ చీరాల టికెట్ కోసం చివరి వరకు పోరాడిన జగన్ మాత్రం ఆమంచివైపు మొగ్గుచూపుకుండా కరణం బలరామకృష్ణమూర్తి కుటుంబం వైపు మొగ్గుచూపారు. మరి ఇంతగా నమ్మి టికెట్ కూడా కీలకమైన నాయకులను పక్కన పెట్టిన తర్వాత కరణం కుటుంబం జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలి? అంటే సానుకూలంగానే ఉండాలి. కానీ రాజకీయాలు రాజకీయాలే అన్నట్టుగా కరణం ఫ్యామిలీ ఇప్పుడు తన దారి తాను చూసుకునేందుకు మార్గం రెడీ చేసుకుంటోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
టిడిపి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం, సీఎం చంద్రబాబు దగ్గర ఉన్న పలుకుబడి, ఇతర కారణాల నేపథ్యంలో తిరిగి మళ్లీ టీడీపీ గూటికే చేరతారని ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనిని చంద్రబాబు నాయుడు ఏ మేరకు స్వాగతిస్తారు, కరణం కుటుంబాన్ని చేర్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరనేడి వాస్తవం. ఈ నేపథ్యంలో కరణం వైసీపీని వదిలి టిడిపిలోకి వెళ్లినా.. టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చినా.. తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే విశ్వాసం, విశ్వాస నీయత అనేవి మాత్రం నాయకులకు ముఖ్యం. వీటిని వదిలేసుకుంటే రాజకీయంగా ఎలా ఉన్నా ప్రజల మధ్య మాత్రం వారికి పరపతి తగ్గుతుందని పరిశీలకులు చెబుతున్న మాట.
