Begin typing your search above and press return to search.

ఉగ్రదాడితో ఇక ఇండియాలో ఆ పేరు కనపడొద్దు అంతే

కరాచీ బేకరీలు.. అప్పుడు ఎప్పుడో ఇండియా ఉమ్మడిగా కలిసి ఉన్న రోజుల్లో.. బ్రిటీష్ వారి హయాంలో ఏర్పడ్డ దుకాణాలవీ..

By:  Tupaki Desk   |   6 May 2025 9:51 AM
Karachi Bakery Renaming Demand
X

కరాచీ బేకరీలు.. అప్పుడు ఎప్పుడో ఇండియా ఉమ్మడిగా కలిసి ఉన్న రోజుల్లో.. బ్రిటీష్ వారి హయాంలో ఏర్పడ్డ దుకాణాలవీ.. కరాచీ రొట్టెలకు నాడు గిరాకీ ఉండడంతో ఆ పేరుతో దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే కరాచీ నగరం విడిపోయాక పాకిస్తాన్ లోకి వెళ్లింది. అయినా ఇండియాలో ఆ పేర్లు కొనసాగాయి. కానీ తాజాగా ఉగ్రదాడితో ఇప్పుడు పాక్ పేర్లు, ఆనవాళ్లు ఎక్కడ దేశంలో ఉండకూడదన్న కృతనిశ్చయంతో దేశంలోని నాయకులు, ప్రజలు కరాచీ బేకరీల పేర్లు తొలగించాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు.

పాకిస్థాన్ ప్రోద్బలంతో కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ తీరుపై దేశంలోని ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్థాన్ పేరు వింటేనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక చోట్ల పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. విశాఖలోనూ పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ నిరసనల క్రమంలోనే విశాఖపట్నంలో ఓ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. సిరిపురం జంక్షన్‌లో ఉన్న 'కరాచీ వాలా' అనే బేకరీ పేరును మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దుకాణం పేరును ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగించడం సరికాదని వాదిస్తున్నారు. గతంలో పాక్ దాడులు జరిగినా ఈ షాప్ జోలికి ఎవరూ వెళ్ళలేదు. ఆ షాప్ పేరు పాకిస్థాన్‌తో లింక్ అయి ఉందని కూడా ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

అయితే తాజాగా విశాఖలో హిందూ జన జాగరణ సమితి చేపట్టిన నిరసనలలో భాగంగా ఈ దుకాణం పేరు మార్చాలనే డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో కరాచీ అనే నగరం ఉందని, ఆ నగరం పేరుతో ఇక్కడ షాప్ ఉండడం ఏమిటని సమితి నిర్వాహకులు ప్రశ్నించారు. దేశభక్తి ఉంటే భారతదేశంలోని ఏదైనా నగరం పేరు పెట్టుకోవచ్చు కానీ, కరాచీ అనే పేరును మాత్రం తక్షణం తొలగించాలని వారు పట్టుబడుతున్నారు.

ఈ డిమాండ్‌తో ఆ దుకాణం ఎదుట నిలిచి ఆందోళనలు నిర్వహించారు. ఈ షాప్ పేరు ఇప్పుడే పెట్టింది కాదని, చాలా ఏళ్ల నాటిదని కొందరు అంటుండగా, పాకిస్థాన్‌పై భారత్ ఏకమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో కచ్చితంగా ఆ పేరుని తొలగించాలని మరికొందరు వాదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుండి పంపించివేశారు.

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినా, ఆ షాప్ పేరు మారుస్తారా లేదా అన్నది ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.