Begin typing your search above and press return to search.

కాపు ఓటు చీలిపోతుందా...!?

కాపులు ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. వారు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై అయిదు అసెంబ్లీ సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 3:00 AM GMT
కాపు ఓటు చీలిపోతుందా...!?
X

కాపులు ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. వారు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై అయిదు అసెంబ్లీ సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే వారు మొదటి నుంచి ఒకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. అలాగే ఒకే పార్టీకి కమిట్ అయిన వాతావరణం లేదు.

సహజంగా చూస్తే కాపులు ఎక్కువ సార్లు కాంగ్రెస్ తో ట్రావెల్ చేశారు. ఇక టీడీపీతో 1983, 1985, 1995లలో ఎన్టీయార్ జమానాలో అడుగులు వేశారు. 1999లో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీల వైపూ కాపులు సర్దుకున్నారు. 2004లో ఏకపక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీకి మెజారిటీ కాపులు అండగా నిలబడ్డారు.

అదే కాపులు 2014లో తెలుగుదేశానికి అవుట్ రేట్ గా సపోర్ట్ ఇచ్చారు. ఇక 2019లో కాపులు మెజారిటీ శాతం వైసీపీని బలపరచారు. కొంత శాతం జనసేనతో కలసి సాగారు. ఇదీ ఉమ్మడి ఏపీ విభజన ఏపీలో కాపుల రాజకీయ ప్రయాణంగా స్థూలంగా చెప్పుకోవాలి.

ఇక ఇపుడు అంటే 2024లో కాపులు ఎటు వైపు అన్న నిలువెత్తు ప్రశ్న కళ్ళ ముందు కదలాడుతోంది. కాపులు ఈసారి జనసేనకు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు అని చాలా కాలంగా అనుకున్న మాట. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాపులలో మళ్లీ చీలిక కనిపిస్తోంది. వారు గతంలో మాదిరిగా వన్ సైడెడ్ గా కాకుండా స్థానికంగా పరిస్థితులకు అనుకూలంగా తమ అభీష్టానికి అనుగుణంగా ఓట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

దానికి కారణం జనసేన అనుసరించిన విధానం అని అంటున్నారు. జనసేన సోలోగా పోటీ చేసి ఉంటే 2009 మాదిరిగా కాపులంతా ఆ పార్టీతో కలసి సాగేవారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. పోనీ ఈ పోటీ అయినా సీట్ల షేర్ లో గౌరవప్రదంగా ఉంటుందా అధికార పదవుల విషయంలో న్యాయం జరుగుతుందా అంటే అది కూడా లేని స్థితి అని ప్రచారం సాగుతోంది.

వ్యూహాత్మకంగా అన్నారో లేక కుండబద్ధలు కొట్టారో తెలియదు కానీ టీడీపీ యువ నేత నారా లోకేష్ అయిదేళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ క్లారిటీ ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. దానికి కౌంటర్ చేయాల్సిన జనసేన పెద్దలు సైలెంట్ కావడం కూడా కాపు సామాజిక వర్గాన్ని ఆలోచనలో పడేస్తోంది అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే కాపు పెద్దలకు అంటూ సంభోదిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ఇపుడు సంచలనంగా మారింది. ఆయన ఆ లేఖలో కాపులు వైసీపీ ఉచ్చులో పడవద్దు అని కోరారు. అంటే కాపులలో వైసీపీ వైపు టర్న్ అయ్యే వర్గం ఉంది అనే అనుమానాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు అన్న మాట.

ఇంకో వైపు చూస్తే కాపుల విషయంలో జగన్ మోసం చేశారని పవన్ ఆ లేఖలో ఆరోపించారు. కాపులు సంఘటితంగా ఉండాలని తన వ్యూహాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అయితే కాపులలో ధీటైన నాయకులు మేధావులు ఉన్నారు. విజ్ఞులు కూడా ఉన్నారు. వారికి నడుస్తున్న రాజకీయ చరిత్ర మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు.

కాపులు సంఘటితం కావాలనే వారు ఓట్లు మొత్తం టీడీపీ జనసేన కూటమి వైపు ఏకపక్షంగా పడాలీ అంటే ముందు కూటమి నుంచే ఒక క్లారిటీ రావాల్సి ఉంది అని అంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే పవన్ కి అధికారంలో వాటా ఇస్తామని సీఎం పదవిని షేర్ చేసుకుంటామని చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రకటన చేస్తే కచ్చితంగా కాపు ఓటు మొత్తం గుత్తమొత్తంగా కూటమి వైపే పడుతుంది అని అంటున్నారు.

అలా కాకుండా కాపుల ప్రయోజనం కోసమే పొత్తు అని చెబుతూ జనసేన రాజకీయం ఏంటో తెలియకుండా కూటమిలో జనసేన పాత్ర ఏమీ తేలకుండా కాపులు మద్దతు అవుట్ రేట్ గా దక్కుతుందా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే కాపులు తమ అభీష్టం మేరకే ఓట్లు వేసుకుంటారు. అలాంటి స్థితిలో కాపు ఓట్లలో వైసీపీ షేర్ కూడా గణనీయంగానే ఉండొచ్చు అన్నది ఒక విశ్లేషణగా ఉంది.