Begin typing your search above and press return to search.

కాపు ఓటు కన్సాలిడేట్ అవుతోందా...!?

ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు సంభవించనున్నాయా. బలమైన కాపు సామాజికవర్గం ఈసారి పూర్తి అప్రమత్తతో అడుగులు వేస్తోందా.

By:  Tupaki Desk   |   11 Jan 2024 2:30 PM GMT
కాపు ఓటు కన్సాలిడేట్ అవుతోందా...!?
X

ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు సంభవించనున్నాయా. బలమైన కాపు సామాజికవర్గం ఈసారి పూర్తి అప్రమత్తతో అడుగులు వేస్తోందా. గతసారి పొరపాట్లు రిపీట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందా అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కాపులు ఏపీ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

వారికి రాజ్యాధికారం అందని పండుగా మారింది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర భారత దేశంలో ఒక బలమైన సామాజిక వర్గం రాజ్యాధికారానికి దూరంగా ఉండడం అన్నది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా జరగలేదు. ఏపీలోనే అది సంభవిస్తోంది. దానికి కారణం కాపులలో అనైక్యత అని ఒక విమర్శ ఉంది.

కాపులు ప్రతీ ఎన్నికల్లోనూ తమకు నచ్చిన పార్టీకి ఓట్లేసుకుంటారు. అది 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా జరిగింది. అయితే నాడు అధిక శాతం ఓట్లు ప్రజారాజ్యానికి పడ్డాయి. ఇక 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కూడా కాపులలో ఒక సెక్షన్ ఓటింగ్ బాగా పడింది. కానీ మిగిలిన ఓట్లు వైసీపీ టీడీపీ పంచుకున్నాయి.

ఇక 2024లో మాత్రం కాపు ఓటు పూర్తిగా కన్సాలిడేట్ కావాలని తెర వెనక కాపు పెద్దలు పధక రచన చేస్తున్నారు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ఆయన సినిమా అత్తారింటికి దారేదిలో చెప్పినట్లుగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ తెలుసుకున్నారు అని అంటున్నారు.

అందుకే ఆయన కాపు పెద్దలకు రాసిన లేఖ చాలా పరిణతితో కూడుకుంది అని అంటున్నారు. అదే ఇపుడు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతోంది అని అంటున్నారు. కాపులు అంతా ఒక్కటి కావాలని ఇదే సరైన టైం అన్న భావన ఉంది అని అంటున్నారు. ఇపుడు ఏపీలో అధికార వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. అదే టైం లో టీడీపీ కూడా మునుపటి మాదిరిగా టోటల్ గా స్ట్రాంగ్ గా లేదు.

ఈ నేపధ్యాన్ని ఉపయోగించుకుని కాపులు గట్టిగా పనిచేస్తే రాజ్యాధికారం సాధ్యపడుతుంది అని అంటున్నారు. జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా ఇచ్చే సీట్లను భారీగా పెంచుకుని ఆ పార్టీతో పొత్తులో ఉంటూనే అధికారంలో వాటా కోరే దిశగా కాపుల రాజకీయం ఉండాలన్నదే ఆ సామాజికవర్గం పెద్దల మాటగా ఉంది.

అందుకే నిన్నటిదాకా వైసీపీ వైపుగా ఉంటారు అని అనుకున్న కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని కూడా జనసేన వైపుగా ఈ పరిణామాలు మళ్ళిస్తున్నాయని అంటున్నారు. పవన్ తో ముద్రగడ కనుక కూడితే జనసేన బలం సామాజికంగా రాజకీయంగా కూడా రెట్టింపు అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.

దాంతో పాటుగా కీలక కాపు నేతలు కూడా రానున్న కాలంలో జనసేనలో చేరుతారు అని అంటున్నారు. ఆ విధంగా కనుక అంతా కలిస్తే తప్పకుండా జనసేనకు యాభై నుంచి అరవై సీట్లు టీడీపీ ఇవ్వాల్సి రావచ్చు అని అంటున్నారు. అదే విధంగా రేపటి ఎన్నికల తరువాత అధికారంలో సగం వాటా కూడా జనసేనకు ఇచ్చేలాగానే పొత్తు ఒప్పందాలు మారుతాయని కూడా అంటున్నారు.

ఇటీవల కాలంలో వైసీపీలో చేరి పది రోజులు తిరగకుండానే జనసేన వైపు మళ్ళిన క్రికెటర్ అంబటి రాయుడు ఆలోచనల వెనక కూడా తాజా సామాజిక రాజకీయ పరిణామాల ప్రభావం ఉంది అని అంటున్నారు. ఇక రానున్న రోజులలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా అంటున్నారు. మొత్తం మీద కాపు ఓటు కన్సాలిడేట్ అయితే అది ఏపీ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుంది అన్నది కూడా మరో వైపు చర్చగా ఉంది.

కాపులు సంఘటితం అయితే బీసీల రూట్ ఎటు అన్నది కూడా చర్వకు వస్తుంది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తూ వైసీపీ చేస్తున్న ఈ సామాజిక సమీకరణలు సోషల్ ఇంజనీరింగ్ తో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.