Begin typing your search above and press return to search.

వైసీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు

ఇక జనసేనకు అతి పెద్ద అండగా కాపులు ఉన్నారు. ఆ సంగతి ఆ పార్టీ నేతలు అందరికీ తెలుసు.

By:  Satya P   |   23 Jun 2026 6:48 AM IST
వైసీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు
X

ఏపీలో సరికొత్త రాజకీయం స్టార్ట్ అయింది. అది సామాజిక కోణం నుంచి మొదలు కావడం విశేషం. ఏపీలో అతి పెద్ద జనాభాగా కాపులు ఉన్నారు. వారి చిరకాల కోరిక కాపుల నుంచి ముఖ్యమంత్రి కావడం. ఆ విషయాన్ని ఏ కాపు నేతను అడిగినా చెబుతారు. తమకూ రాజ్యాధికారం కావాలని. ఇదిలా ఉంటే కూటమి రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. దాని వెనక కాపుల సమర్ధన పెద్ద ఎత్తున ఉంది. కాపులంతా తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని చూసుకున్నారు. ఆయన కోసం జెండా ఎత్తారు. అయితే పవన్ కులాలకు అతీతమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అది కాపు వర్గంలో కొంతమందికి ఇబ్బందిగా మారింది. మరో వైపు చూస్తే రెండేళ్ల కూటమి పాలనలో కాపులకు ఏమీ చేయలేదని రాజకీయ విమర్శలు చేస్తోంది వైసీపీ. ఈ నేపధ్యంలో కాపులలో అసంతృప్తి ఉందని వైసీపీ గ్రహించిందా లేదా తామే ఆ అసంతృప్తిని రాజేయాలని చూసిందా అన్నది తెలియదు కానీ వైసీపీ కాపులు అంతా ఒక చోట సమావేశం పెట్టుకున్నారు. అది కూడా గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి కోనసీమ జిల్లాలో.

కాపు కాసేందుకేనా :

తాము కాపులకు అండగా ఉంటామని వారికి ఏ కష్టం వచ్చినా తాము నిలబడతామని వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు. తమ మీటింగ్ వెనక రాజకీయ అంశాల కంటే కూడా కాపులను కాపాడుకోవాలి అన్న సామాజిక కోణమే ఉందని వారు అంటున్నారు. కాపుల కోసం తాము అతి పెద్ద భరోసాగా నిలబడతామని కూడా అంటున్నారు. అన్యాయం జరిగిన ప్రతీ కాపు వెనకాల తాము ఉన్నామన్న ధైర్యాన్ని ఇస్తామని కూడా వారు చెబుతున్నారు.

కులం బట్టి పదవులు :

ఇక ఈ మీటింగులో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ లాంటి వారు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కులాన్ని చూసే పదవులు ఇచ్చారని ఇది తాము ఒప్పుకుని తీరాలని ఆయన అనడం వెనక చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు. కులం కాదు అందరి వాడిని అని పవన్ చెప్పిన మాటలతో బొత్స వ్యాఖ్యలను పోల్చుకుంటే కులం తోనే అంతా అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు. ఇక ఇతర కాపు నేతలు కూడా కులం గురించి మాట్లాడుకుంటే తప్పేమిటి అని అంటున్నారు. మీకు దండం పెడుతున్నా నాకు కులం అంటగట్టవద్దు అని పవన్ కాకినాడ సభలో మాట్లాడిన దానికి కౌంటర్ గానే ఇవన్నీ అన్న చర్చ కూడా సాగుతోంది.

కాపులలో బాధ ఉంటే :

ఇదిలా ఉంచితే కాపులలో కూటమి ప్రభుత్వం పట్ల బాధ ఉందా తమకు ఏమీ జరగలేదని ఆవేదన ఉందా అన్న చర్చ ఇపుడు ముందుకు వస్తోంది. నిజంగా అది ఉంటే కనుక వైసీపీ నేతలు జరుపుతున్న ఈ సమావేశాలకు అర్ధం పరమార్ధం అన్నది కచ్చితంగా దక్కుతుంది. అయితే కూటమి పట్ల వ్యతిరేకత నిజంగా కాపులకు ఉన్నా అది వైసీపీకి సానుకూలం ఎలా అవుతుంది అన్న మరో ప్రశ్న కూడా ఉంది. వైసీపీ హయాంలోనే కాపులు చక్కగా ఉన్నారని ఫ్యాన్ పర్టీ కాపులు అంటున్నారు కానీ అది న్యూట్రల్ కాపులలో అంతలా వెళ్తోందా వారు నిజంగా వైసీపీ బెటర్ అనుకుంటున్నారా అన్నది కూడా తేలాల్సిన విషయం.

జనసేన రీ సౌండ్ :

ఇక జనసేనకు అతి పెద్ద అండగా కాపులు ఉన్నారు. ఆ సంగతి ఆ పార్టీ నేతలు అందరికీ తెలుసు. పవన్ కూడా కాపు కులానికే కట్టేయకండి అని అన్నారు కానీ కాపులను వదులుకోమని ఎక్కడా చెప్పలేదు, ఇదే కాకినాడ సభలో ఆయన మంచి చెబితే కాపుల ఓట్లు పోతాయా అని కూడా ప్రశ్నించారు. ఇక వైసీపీ కాపు రాజకీయంతో జనసేన కూడా రంగంలోకి దిగిపోయింది. కాపుల విషయంలో తాము గట్టిగా నిలబడాలని ఆ పార్టీ నేతలు కూడా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో ఇపుడు కాపు సబ్జెక్ట్ తో జనసెనా వైసీపీల మధ్య సామాజిక కోణంలో నుంచి రాజకీయ రచ్చ సాగుతోంది. ఇవి బయటకు రాజకీయ విమర్శలుగా కనిపిస్తున్నా అంతరాలలో చూస్తే కనుక సామాజిక వర్గం మద్దతు విషయంలోనే అన్నది అర్థం అవుతోంది అంటున్నారు. మరి న్యూట్రల్ గా ఉన్న కాపులు ఎవరి పక్షం చేరుతారు, ఎవరికి కాపు కాస్తారు అన్నది ఇపుడే తేలదు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా మూడేళ్ళ వ్యవధిలో ఉన్నాయి కాబట్టి.