ముద్రగడ ప్లేస్ భర్తీ చేసేదెవరు..?
నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, వ్యవస్థలు అనేవి శాస్వతం. ఈ వ్యవస్థలను ముందుండి నడి పించేందుకు నాయకులు అవసరం.
By: Tupaki Desk | 21 April 2025 12:00 AM ISTనాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, వ్యవస్థలు అనేవి శాస్వతం. ఈ వ్యవస్థలను ముందుండి నడి పించేందుకు నాయకులు అవసరం. ఒకనాయకుడు పక్కకు తప్పుకొన్నంత మాత్రాన.. పార్టీలు ఆగిపోవు.. ఒక ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నంత మాత్రాన ముఖ్యమంత్రి పీఠమూ ఆగిపోదు. కానీ, కాపుల కోసం.. ఉద్యమించి.. వారి హక్కులు.. రాజ్యాధికారం.. వారి రిజర్వేషన్ల కోసం తపించిన.. ముద్రగడ పద్మనాభం ప్లేస్ మాత్రం ఇప్పటి వరకు భర్తీ కాకపోవడం గమనార్హం.
ముద్రగడను వ్యతిరేకించేవారు కూడా.. ఆయన ఉద్యమ స్పూర్తిని తప్పుపట్టలేరు. వ్యక్తిగతంగా ఆయనపై ఇతర కారణాలను చూపించినా.. కాపు ఉద్యమం విషయంలోను, వారిని చైతన్యం చేయడంలోనూ.. ముద్ర గడకు మంచి మార్కులే ఉన్నాయి. ఆయనే చెప్పినట్టు కాపు ఉద్యమంలో ఆయన ఓడిపోయారు. కానీ, కాపులు ఓడిపోయారా? ఓడిపోతున్నారా? అనేది ప్రశ్న. ఎందుకు ఒకరు కాడి పడేసినంత మాత్రాన.. ఒక ఉద్యమం ఆగిపోతే.. అది ఆ జాతికే నష్టం.
అప్పుడైనా ఇప్పుడైనా అదే ఫార్ములా వర్తిస్తుంది. కాపుల చైతన్యం కోసం.. ఇప్పుడు ఉద్యమించే నాయకు లు కరువయ్యారన్నదినిష్ఠుర సత్యం. జెండాలు-అజెండాల మాటన కాపు ఉద్యమాన్ని పాతిపెడుతున్న తీరు.. రేపటి తరానికి ఇస్తున్న సందేశం ఏంటి? అనేది కాపు నాయకులుగా సుప్తచేతనావస్థలో ఉన్నవారు ఆలోచించుకుని తీరాల్సిన విషయం. ముద్రగడతో ప్రారంభమై.. ముద్రగడతోనే అంతమైతే.. కాపుల ఉద్యమానికి ప్రాతిపదిక.. ఉండదన్నది స్పష్టమవుతుంది.
ప్రభుత్వాలపై పోరాడేందుకు.. జెండాలే కట్టనవసరం లేదన్న చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి.. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటానికి బీజాలు వేసింది. అలాంటి అంతటి మహోద్యమం.. విప్లవాత్మక పంథా ఆశించకపోయినా.. కాపుల కోసం..నిలబడే నాయకుడు అంటూ ఎవరూ లేకపోవడం మాత్రం చిత్రం. ఎవరికి వారు జెండా అజెండాలను పెట్టుకుని.. ముందుకు సాగుతున్నంత కాలం.. ముద్రగడ స్థానాన్ని భర్తీ చేసేవారే లేరన్న విషయం స్పష్టమవుతుంది.
చిన్న సామాజిక వర్గం కోసం.. ఉద్యమించిన.. నాగాలు.. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో అధికారాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఆ తరహా స్ఫూర్తయినా.. ఉంటే.. కాపుల ఉద్యమం సజీవంగా ఉంటుంది. ముద్రగడ స్థానంలో మరో నాయకుడు వస్తారు. కొరవడిన స్ఫూర్తి.. రాజకీయ చివురుటాకులను పట్టుకుని వేలాడుతున్న తీరు.. వంటివి పరిస్థితిని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. సో.. కాపు సోదరులు ఇప్పటికైనా.. ఒక పంథాను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
