కాపులు అంటే జనసేన మాత్రమేనా? టిడిపిలో కాపులు కాపులు కారా?
రాష్ట్రంలో కీలక సామాజిక వర్గం అయిన కాపుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Tupaki Desk | 9 July 2025 10:30 AM ISTరాష్ట్రంలో కీలక సామాజిక వర్గం అయిన కాపుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాపు నాయకులు, కాపు సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనేది వాస్తవం. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా లోలోన మాత్రం నాయకులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా టిడిపిలో ఉన్న కాపు నాయకులు అధిష్టానం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవడంలేదని అంటున్నారు.
తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు వాపోతుండడం గమనార్హం. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ కీలక నాయకుడు ఇంట్లో తాజాగా సమావేశమైన టిడిపి కాపు సామాజిక వర్గం నాయకులు తమ దుస్థితిపై చర్చించారని తెలిసింది. ఎన్నికల సమయంలో తమను వాడుకున్నారని, తమ నియోజకవర్గా లను జనసేనకు ఇచ్చారని వారు వాపోయారు. అంతేకాదు ఇప్పుడు కాపులు అంటే జనసేన మాత్రమేనా? టిడిపిలో కాపులు కాపులు కారా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్క నాయకుడికి కూడా ప్రాధాన్యం తగ్గటం లేదని వారు చెప్పడం రాజకీయంగా వారు పడుతున్న ఇబ్బందిని గుర్తు చేస్తుంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు బలమైన వాయిస్ వినిపించాలని, తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలు తప్పవని తెలిసేలా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అంతేకాదు జనసేన లోని కాపు నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం లో సగం కూడా తమకు ఇవ్వడం లేదని ఈ విషయాన్ని నేరుగా పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు.. మండల స్థాయి నాయకులు.. ఇలా సమావేశం కావడం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను అదేవిధంగా కూటమిలో నెలకొన్న సమస్యలను వారు చర్చించటం సంచలనంగా మారింది. తమ సీట్లను కూడా వదులుకొని జనసేన నాయకులకు ఇచ్చామని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు. కానీ తమకు చిన్న పనులు కూడా చేసి పెట్టడం లేదని, కనీసం తాము వస్తున్నామని తెలిస్తే దూరంగా వెళ్లిపోతున్నారని, ఏదో పనులు పెట్టుకున్నట్టుగా చెబుతున్నారని కూడా నాయకులు అంతర్గతంగా చర్చించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే వీటిలో 14చోట్ల టిడిపి నాయకులు విజయం సాధించారు. వారిలో నలుగురు కాపు సామాజిక వర్గానికి చెందినవారున్నారు. అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కానీ వీరికి ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన నుంచి కానీ ఇతర నాయకుల నుంచి కానీ మద్దతు లభించడం లేదన్నది ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించలేకపోతున్నారనేది వీరు వాదన. మరి దీనిపై చంద్రబాబు ఏ మేరకు దృష్టి పెడతారు. ఈ సమస్యను ఇక్కడితో పరిష్కరిస్తారా.. లేక వచ్చే ఎన్నికల వరకు సాగదీస్తారా.. అనేది చూడాలి.
