కూటమిపై 'కులాల' సంతృప్తి.. కామన్ ..!
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఇష్టంగానో.. అయిష్టంగానో చేతులు కలిపాయి.
By: Tupaki Desk | 19 May 2025 7:00 PM ISTగత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఇష్టంగానో.. అయిష్టంగానో చేతులు కలిపాయి. అవే.. కాపులు-కమ్మలు. వాస్తవానికి ఈ రెండు కులాల దారులు వేరు. అయినప్పటికీ.. జగన్‌పై వ్యతిరేకతను పెంచడంలో సక్సెస్ అయిన.. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులు.. ఈ రెండు సామాజిక వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నించి.. విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి తమకు సీటు రాకపోతే.. రగిలిపోయే నాయకులు కూడా.. తాము తప్పుకొని మరీ సీటు వేరే వారికి ఇచ్చారు.
దీనికి కారణం.. ఆయా సామాజిక వర్గాల్లో అప్పటి వరకు ఉన్న విభేదాల స్థానంలో జగన్ వ్యతిరేకత పెరగడ మే. దీనిని అందిపుచ్చుకున్న కూటమి విజయం దక్కించుకుంది. ఇప్పుడు 11 మాసాలు అయింది. మరి ఈ బంధం ఎలా ఉంది? ఆ రెండు కులాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయా? అంటే.. చెప్పడం కష్టంగా మారింది. క్షేత్రస్థాయిలో మీతో స్నేహం ఎన్నికల వరకే.. అన్నట్టుగా ఓ సామాజిక వర్గం నాయకులు వ్యవహరిస్తున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా. పైకి మాత్ర మౌనంగా ఉంటున్నారు. నిజానికి తాము తప్పుకొని కూడా.. ఓ సామాజిక వర్గానికి నాయకులు హెల్ప్ చేశారు. కానీ, ఇప్పుడు ఏ సామాజిక వర్గం త్యాగం చేసి.. సీట్లు ఇచ్చిందో అదే సామాజిక వర్గానికి అవమానాలు ఎదురవుతున్నాయని సచివాలయంలోనే చర్చ సాగుతోంది. ఇది మున్ముందు పరిణామాలను తేటతెల్లం చేస్తోంది. ఒక నియోజకవర్గంలో ఇలాంటి తేడా ఉంటే సరే.. కానీ.. దాదాపు 20-30 నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వర్గ పోరు తీవ్రస్థాయిలో ఉంది.
ఎవరికి వారే మేమంటే మేమే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి వోవర్ హెడ్ ట్యాంకు స్వచ్ఛంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో కుళాయిలు మురికి పడితే.. ఫలితం ఎలా ఉంటుందన్నది చెప్పడం ఈజీనే. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య కూడా.. పైస్థాయిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఓ కీలక సామాజిక వర్గం రగులుతోంది. తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని.. తమ సహకారాన్ని మరిచిపోతున్నారని చెబుతోంది. సో.. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే.. ఇబ్బందులు తప్పవు.
