.ఏపీలో కాపు ప్రకంపనలు.. వరస భేటీలు !
కాపులకు అన్యాయం చేయాలని చూసే పార్టీలను రాజకీయాలకు అతీతంగా ఓడిస్తామని కూడా శపధం పట్టారు.
By: Satya P | 17 Jun 2026 12:18 PM ISTఏపీ రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా కాపులు ఉన్న సంగతి విధితమే. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపులు ఏకంగా 75 సీట్లలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించే సత్తా కలిగి ఉన్నారు. ఏపీలో ప్రభుత్వం ఎవరైనా ఏర్పాటు చేయాలీ అంటే 88 సీట్లు అవసరం. మరి ఈ మ్యాజిక్ నంబర్ కి సరిపడా ప్రభావితం చేసే పొజిషన్ లో కాపులు ఉన్నా వారికి సీఎం పదవి అందని పండు గా మారుతోంది. దాంతో పాటు సామాజికంగా కూడా తమ ఆకాంక్షలు తీరడం లేదు అన్న ఆవేదన వారిలో ఉంది. ఇక ఏపీలో టీడీపీ కూటమికి 2024 ఎన్నికల్లో కాపులు నూటికి నూరు శాతం జై కొట్టి ఓటెత్తారు. వైసీపీకి మొత్తం కోస్తా జిల్లాలలో ఎక్కడా ఒక్క సీటు కూడా దక్కకుండా పోయిందంటే అది కాపుల మహిమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు గడచాయి. మెల్లగా కాపులలో అసంతృప్తి ఒక్కోటిగా బయట పడుతోంది. ఈ క్రమంలో వారంతా కలసి వరస మీటింగులు పెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో సాగుతున్న ఈ భేటీలలో రాజకీయ చర్చలే ప్రధానంగా ఉండడం విశేషం.
రాజమండ్రితో శ్రీకారం :
ఇటీవల రాజమండ్రీలో కాపుల రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాపులంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ మీద సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు దక్కాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు దక్కడం లేదని కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రాజకీయంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా కొంతమంది నేతలు పేర్కొన్నారు. దీంతో సమీప భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించాలని ఈ భేటీకి హాజరైన కాపు నేతలు అంతా నిర్ణయించారు.
సిక్కోలులో రీ సౌండ్ :
ఇది జరిగిన తరువాత ఉత్తరాంధ్రాలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో తూర్పు కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ నెల 14న జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ సహా సీనియర్ నేతలు అంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపులకు అన్యాయం జరిగితే రాజకీయాలకు అతీతంగా అంతా కలసి ఎదుర్కోవాలని నిర్ణయించారు. కాపులకు సీఎం పదవి ఇస్తే కాపు ఆంధ్రా అని శాశ్వతం అవుతుందని ఇక వారే ఎల్ల కాలం ఆ పదవిలో ఉంటారని ఆందోళనతోనే దక్కనీయకుండా చేస్తున్నారు అని సమావేశానికి హాజరైన వక్తలు పేర్కొనడం విశేషం. కాపులకు అన్యాయం చేయాలని చూసే పార్టీలను రాజకీయాలకు అతీతంగా ఓడిస్తామని కూడా శపధం పట్టారు.
కోన సీమలో భేటీ :
ఇక ఈ నెల 21న కోనసీమ జిల్లాలో మరో కీలక సమావేశాన్ని కాపులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. కోన సీమ జిల్లాలోని వెంకటాయ పాలెంలో జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు పాల్గొంటారు అని అంటున్నారు. ఇక లంచ్ సమవేశానికి కు వైసీపీలో ఉన్న రాష్ట్ర స్థాయి కీలక కాపునేతలకు ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఒక ఆరంభం అని మరో రెండు కీలక సమావేశాలు నిర్వహిస్తామని కాపు నేతలతో సాగే ఈ సమావేశాలలో అనేక అంశాలను చర్చిస్తామని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గం నేతలకు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం మీద ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తామని అంటున్నారు. అంతే కాదు భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది కూడా నిర్ణయిస్తామని త్రిమూర్తులు చెబుతున్నారు. మొత్తం మీద వరుసగా సాగుతున్న కాపు సమావేశాలు ఏపీ రాజకీయాల్లో ఏ ప్రకంపనలు క్రియేట్ చేస్తాయన్నది అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
