తల్లి చేయి కోల్పోయిన జవాన్‌కు న్యాయం కోసం సైన్యం రంగంలోకి.. దేశవ్యాప్తంగా సంచలనం
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి 140 కోట్ల మంది భారతీయులను కాపాడే ఒక జవాన్ కుటుంబానికి స్వదేశంలోనే ఘోర అన్యాయం జరిగింది.
By: A.N.Kumar | 25 May 2026 10:00 PM ISTదేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి 140 కోట్ల మంది భారతీయులను కాపాడే ఒక జవాన్ కుటుంబానికి స్వదేశంలోనే ఘోర అన్యాయం జరిగింది. వ్యవస్థల నిర్లక్ష్యానికి, వైద్యుల అనాలోచిత వైఖరికి ఒక వీర జవాన్ తల్లి తన కుడి చేతిని కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. న్యాయం కోసం స్వయంగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలే రోడ్డెక్కి పోలీస్ కమిషనరేట్‌ను ముట్టడించడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వైద్యుల నిర్లక్ష్యానికి బలైన తల్లి
ఐటీబీపీ జవాన్‌గా దేశానికి సేవలు అందిస్తున్న వికాస్ సింగ్ తల్లి నిర్మలా దేవి (56) మే 5వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే కాన్పూర్‌లోని ‘కృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’ లో చేర్పించారు. ఐటీబీపీ ప్యానెల్‌లోనే ఈ ఆసుపత్రి ఉండటంతో జవాన్ తన తల్లిని నమ్మకంతో అక్కడ చేర్చారు. అయితే చికిత్స పేరుతో అక్కడ ఉన్న వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో చేర్చిన మరుసటి రోజుకే నిర్మలా దేవి కుడి చేయి క్రమంగా నల్లగా మారి, తీవ్రంగా వాచిపోయింది. నరకయాతన అనుభవిస్తూ బాధతో విలవిల్లాడుతున్న తన తల్లిని కాపాడాలని, తగిన చికిత్స అందించాలని జవాన్ వికాస్ సింగ్ ఆసుపత్రి సిబ్బందిని, వైద్యులను కాళ్ళు పట్టుకోనంత పని చేస్తూ వేడుకున్నారు. అయినా సరే ఆసుపత్రి యాజమాన్యం ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని, కనీస బాధ్యత కూడా తీసుకోలేదని కుటుంబం కన్నీరుమున్నీరైంది.
చేయి కుళ్లిపోయింది.. కన్నీటి గాథ!
కృష్ణ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నిర్మలా దేవిని వెంటనే కాన్పూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రి అయిన ‘పారస్ ఆసుపత్రి’ కి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. కృష్ణ ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే ఆమె చేతికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయిందని, ఫలితంగా చేయి పూర్తిగా కుళ్లిపోయిందని తేల్చారు. ఆ ఇన్ఫెక్షన్ గనుక గుండె వరకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించడంతో ఆమె ప్రాణాలను కాపాడటం కోసం మే 17న వైద్యులు ఆమె కుడి చేతిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే జవాన్, కళ్ళ ముందే తన తల్లి చేయి కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాడు.
థర్మోకోల్ బాక్సులో తల్లి చేయి.. స్పందించని పోలీసులు
ఈ ఘోరానికి కారణమైన కృష్ణ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని జవాన్ వికాస్ సింగ్ రైల్బజార్ పోలీసులను ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రభావవంతమైన ఆసుపత్రి యాజమాన్యానికి లొంగిపోయిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి సైతం నిరాకరించారని ఆరోపణలు వచ్చాయి.
వ్యవస్థలన్నీ కళ్ళు మూసుకున్న వేళ తీవ్ర మనోవేదనకు గురైన ఆ జవాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 19న తన తల్లికి తొలగించిన కుడి చేతిని ఒక థర్మోకోల్ బాక్సులో పెట్టుకుని, న్యాయం కోసం నేరుగా కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్నారు. కళ్ళ ముందే ఒక కొడుకు తన తల్లి తెగిపోయిన చేతిని పట్టుకుని న్యాయం కోసం తల్లడిల్లుతున్న దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ స్పందించి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో తప్పు చేసిన వైద్యుల పేర్లు లేకపోవడం, ఆసుపత్రిని కాపాడేలా రిపోర్టును మలిచారనే విమర్శలు వెల్లువెత్తాయి.
రంగంలోకి ఐటీబీపీ బలగాలు: కమిషనరేట్ ముట్టడి
తమ తోటి జవాన్‌కు జరిగిన అన్యాయాన్ని, దానికి తోడు వ్యవస్థల పక్షపాత వైఖరిని ఐటీబీపీ బలగాలు సహించలేకపోయాయి. జవాన్‌కు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నాయి. కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ నేతృత్వంలో సుమారు 50 మంది ఐటీబీపీ సిబ్బంది పూర్తి సైనిక యూనిఫాంలో కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌ను చుట్టుముట్టారు.
సరిహద్దుల్లో ఉండాల్సిన సైనికులు నగర నడిబొడ్డున కమిషనరేట్ ముందు నిలబడటంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎలాంటి హింసకు తావులేకుండా అత్యంత క్రమశిక్షణతో ఐటీబీపీ సిబ్బంది తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం చేసిన తప్పులను, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన అన్ని తిరుగులేని ఆధారాలను కమిషనర్ ముందు ఉంచారు.
లొంగివచ్చిన అధికార యంత్రాంగం
ఐటీబీపీ బలగాల తిరుగులేని ఒత్తిడికి , దేశవ్యాప్తంగా వస్తున్న క్రోధానికి కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ దిగిరాక తప్పలేదు. గతంలో ఇచ్చిన పక్షపాత విచారణ నివేదికను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కేసుపై సరికొత్తగా, పారదర్శకంగా విచారణ జరిపించి, బాధ్యులైన వైద్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆర్మీ అధికారులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.
ఐటీబీపీ అధికారి సంచలన వ్యాఖ్యలు
"ఇదే కృష్ణ ఆసుపత్రిలో గతంలో కూడా ఐటీబీపీకి చెందిన ఒక మహిళా కానిస్టేబుల్, అలాగే ఒక ఇన్‌స్పెక్టర్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ఇదొక మరణాల కార్పొరేట్ అడ్డాగా మారింది." అని ఐటీబీపీ అధికారి అర్పిత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
తన ప్రాణాలను దేశానికి అంకితం చేసిన ఒక సైనికుడి కుటుంబానికే ఈ దేశంలో రక్షణ, న్యాయం కరువైతే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తమ జవాన్ తల్లి చేయిని బలితీసుకున్న ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేసి, బాధ్యులను జైలుకు పంపే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఐటీబీపీ స్పష్టం చేసింది. న్యాయం కోసం సైన్యమే స్వయంగా రోడ్డెక్కిన ఈ అరుదైన, సంచలన ఘటన భారత వైద్య, పోలీస్ వ్యవస్థల తీరుపై ఒక పెద్ద మచ్చగా మిగిలిపోనుంది.
