పొలిటికల్ టాక్: 'కంకిపాడు' మళ్లీ వస్తుందా ..!
నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం రాజకీయ వర్గాల మధ్య ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఈనెల 16వ తారీఖున పార్లమెంటు ప్రత్యేకంగా ఈ విషయంపైనే సమావేశం కానుంది.
By: Garuda Media | 12 April 2026 12:00 PM ISTనియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం రాజకీయ వర్గాల మధ్య ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఈనెల 16వ తారీఖున పార్లమెంటు ప్రత్యేకంగా ఈ విషయంపైనే సమావేశం కానుంది. 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే మూడు రోజుల పార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించి దీనిపై చర్చను పూర్తి చేయనున్నారు. తద్వారా 2029 ఎన్నికల నాటికి కచ్చితంగా నియోజవర్గాలను పునర్విభజన చేయాలని పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇక ఈ విషయంపై రాజకీయ వర్గంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో తమ నియోజకవర్గంలో జరిగే మార్పులు ఏంటి? ఏ వర్గం ఓటర్లు ఎటువైపు వెళ్తారు.. అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ పరంగా చూస్తే పెనమలూరు- విజయవాడ తూర్పు నియోజకవర్గాల మధ్య కంకిపాడు నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ ఆసక్తిగా మారింది. గతంలో కంకిపాడు నియోజకవర్గం కొనసాగింది. కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూ అనేకసార్లు విజయం సాధించారు.
ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా విజయవాడ తూర్పు- పెనుమలూరు నియోజకవర్గం గా ఇది విడిపోయింది. తద్వారా కంకిపాడు నియోజకవర్గం రద్దయింది. అయితే ఇప్పుడు నియోజకవర్గం పునర్విభజనతో కంకిపాడు నియోజకవర్గాన్ని పునరుద్ధరిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపులు ఎక్కువగా ఉన్న క్రమంలో టిడిపిచ జనసేన నాయకులు ఈ విషయంపై ఆసక్తిగా చర్చలు చేస్తున్నారు.
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఒకప్పుడు కంకిపాడు నియోజకవర్గాన్ని శాసించిందనే చెప్పాలి. దేవినేని నెహ్రూ వరుస విజయాలు దక్కించుకున్నారు. దీనికి కారణం ఆ సామాజిక వర్గమేనన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గం బలమైన ప్రభావం చూపించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కంకిపాడు నియోజకవర్గం కనుక ఏర్పడితే ఇటు పెనమలూరు లోని కొంత భాగాన్ని అటు విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కొంత భాగాన్ని కలిపి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
