కాణిపాకంలో 'కుర్చీ'లాట.. కూటమికి హెడ్డేక్.. !
అయితే.. ఈ బోర్డు నియామకంలో కూటమి సర్కారు మీన మేషాలు లెక్కిస్తోంది. రోజు రోజుకూ.. జాప్యం పెరుగుతుండడంతో చైర్మన్ గిరీ కోసం నాయకుల సంఖ్య పెరుగుతోంది.
By: Tupaki Desk | 11 May 2025 9:00 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో బోర్డులను ఏర్పాటు చేసే విషయం ఆలస్యమవుతోంది. దీంతో ఆయా బోర్డుల్లో చోటు దక్కిం చుకోవాలని భావిస్తున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంతేకాదు.. ఒకరికి మించి నాయకులు పోటీ పడుతూ.. దీనిని రాజకీయం చేస్తున్నారు. ఫలితంగా ఆలయాల వ్యవహారం దుమారం రేపుతోంది. రాయలసీమలోని సుప్రసిద్ధ వినాయక ఆలయం కాణిపాకంలోనూ కుర్చీలాట కొనసాగుతోంది. ఈ ఆలయానికి.. ఉన్న పాలక మండలి వైసీపీ హయాం ముగిసి పోవడంతో పక్కకు తప్పుకొంది. దీంతో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే.. ఈ బోర్డు నియామకంలో కూటమి సర్కారు మీన మేషాలు లెక్కిస్తోంది. రోజు రోజుకూ.. జాప్యం పెరుగుతుండడంతో చైర్మన్ గిరీ కోసం నాయకుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కానిపాకం ఆలయ చైర్మన్‌గా చేసిన మణినాయుడు.. వైసీపీలో ఉన్నారు. అయితే.. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన తనకే ఈ చైర్‌ను ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, పొరుగు పార్టీ నుంచి వచ్చిన వారికి ఎలా ఇస్తారని.. తాము ఇక్కడ దశాబ్దాల నుంచి పార్టీ కోసం సేవ చేస్తున్నామని టీడీపీ నేత పూర్ణచంద్ర డిమాండ్ చేస్తున్నారు.
అసలు వీరిద్దరూ కాదు.. ఆర్థికంగా సంపన్నుడిని.. నేనైతే.. ప్రభుత్వంతో పనిలేకుండా కానుకలతో ఇబ్బంది లేకుండా .. సొంత నిధులు ఖర్చు చేసి మరీ.. ఆలయాన్నిడెవలప్ చేస్తానని మరో నేత మధుసూదన్ పట్టుబడుతున్నారు. ఇలా.. వీరి ముగ్గురి మధ్య కుర్చీలాట సాగుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే మురళీ మోహన్.. తన అనుచరులనురంగంలోకి దింపాలని ప్రయత్నిస్తు న్నారు. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్న కాణిపాకం ఆలయంలో తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయ కుడిని చైర్మన్‌ను చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది.
మరోవైపు.. రెండు మూడు మాసాల్లోనే వినాయకచవితి పర్వదినం రానుంది. దీనికి ముందు నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం పాలక మండలి లేకపోవడంతో ఆలయ కార్యనిర్వహణాధికారే సర్వం తానై వ్యవహారాలు చూస్తున్నారు. కానీ, ఆయన ను కూడా ఫ్రీ గా చేసుకోకుండా నాయకులు తమ వేళ్లు పెడుతున్నారన్న చర్చసాగుతోంది. కాంట్రాక్టుల నుంచి పనుల వరకు తమ వారికి ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో వినాయక చవితికి సంబంధించిన ఏర్పాట్లు.. బ్రహ్మోత్సవాల వ్యవహారం.. కూడా డోలాయమానంలో పడింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని పాలక మండలిని ఏర్పాటు చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
