Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతలు బ్రిటీష్ వారి పిల్లలే.. కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

By:  Tupaki Desk   |   10 April 2025 12:50 PM IST
కాంగ్రెస్ నేతలు బ్రిటీష్ వారి పిల్లలే.. కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
X

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ వారు వదిలి వెళ్లిన "పిల్లలు" అని, వారి పాలనలో దేశం అవినీతికి నిలయంగా మారిందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చెందిందని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆమె ఒక సభలో మాట్లాడుతూ "2014కి ముందు దేశం అవినీతితో అట్టుడికింది. ప్రధాని మోదీ వచ్చాక అన్నీ మారాయి. తన బలమైన నిర్ణయాలతో దేశం పట్ల నిబద్ధతతో ఆయన దేశంపై నెలకొన్న మచ్చను తొలగించారు" అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వాన్ని పుణికిపుచ్చుకుందని, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ కూడా బాధ్యత వహించాలని ఆమె ఆరోపించారు.

"కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో అశాంతి, భయానక వాతావరణం ఉండేది" అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎంతో కష్టంతో పాలన సాగిస్తుంటే, కాంగ్రెస్ నేతలు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా కంగనా రనౌత్ తప్పుబట్టారు. మహిళలకు నెలకు రూ. 8,000, ఏడాదికి రూ. 50,000 ఇస్తామని కాంగ్రెస్ నేతలు అబద్ధపు హామీలు ఇచ్చారని ఆమె విమర్శించారు.

ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ప్రయోజనాలను కేంద్ర మంత్రి అమిత్ షా వివరిస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గొడవ చేసి సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారని కంగనా రనౌత్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం, అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు వక్ఫ్ ఆస్తుల రికార్డులను డిజిటలైజ్ చేసి, వాటిని ఒకే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అంతేకాకుండా కొత్తగా నియమించబడిన వక్ఫ్ ట్రిబ్యునళ్ల ద్వారా భూ వివాదాలను పరిష్కరించడానికి ఒక కాలపరిమితితో కూడిన కమిటీలను ఏర్పాటు చేసుకునే అధికారం ఈ చట్టం కలిగిస్తుందని ఆమె వెల్లడించారు.

మొత్తానికి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.