Begin typing your search above and press return to search.

ఆపద వస్తే కానీ ‘కంగన’కు తత్త్వం బోధపడలేదు

ఈ విపత్కర పరిస్థితుల్లో మండీ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

By:  Tupaki Desk   |   7 July 2025 3:30 PM IST
ఆపద వస్తే కానీ ‘కంగన’కు తత్త్వం బోధపడలేదు
X

హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ప్రాణనష్టంతో పాటు అపారమైన ఆస్తినష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మండీ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరదల అనంతరం బాధితులను పరామర్శించడానికి వచ్చిన కంగన మాట్లాడుతూ "నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్ర మంత్రినీ కాను. అయినా కేంద్రం నుంచి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను," అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. "ఒక ఎంపీగా సహాయ చర్యల్లో పాల్గొనడానికి ఆమెకు ఎంతవరకు అవకాశం ఉంది?", "ఇలాంటి సమయాల్లో ఎంపీలు తమ బాధ్యతల నుండి దూరంగా ఉండొచ్చా?" అనే ప్రశ్నలు స్థానిక ప్రజలలో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

- విపత్తులలో ఎంపీల బాధ్యత ఏంటి?

ప్రజా ప్రతినిధిగా ఎంపీకి నేరుగా విపత్తు సహాయ నిధులను విడుదల చేసే అధికారం లేకపోయినా, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సహాయం తీసుకురావడం, బాధిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి బాధితుల పరిస్థితిని అర్థం చేసుకోవడం, మానవీయ హితబద్ధతతో స్పందించడం ఒక పార్లమెంటేరియన్ ప్రధాన బాధ్యతగా పరిగణించబడుతుంది.

-కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు

కంగనా తన పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఇలాంటి విపత్తులకు కారణమైన వారు ఇప్పుడు ముఖం దాచుకుంటున్నారు. అవినీతికి పాల్పడ్డ వారే ఈ పరిస్థితికి కారకులు" అని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా "రాబోయే 20 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం," అంటూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

-రాజకీయ విమర్శల మధ్య ‘ప్రజా బాధ్యత’ చర్చ

విపత్తు సమయంలో ప్రజలకు సహాయంగా ఉండాల్సిన కీలక సమయంలో ఎంపీ కంగనా రాజకీయ విమర్శలతో పక్కదోవ పట్టించడం, బాధితులపై పూర్తి దృష్టి కేంద్రీకరించకపోవడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విపత్తు సమయంలో ప్రభుత్వాల సామర్థ్యాలు, ప్రతినిధుల స్పందన, సహాయ చర్యల్లో సమగ్రత వంటి అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే.కంగనా పర్యటనను కాంగ్రెస్ నాయకులు రాజకీయ నాటకంగా అభివర్ణిస్తున్నారు. "ఇంతకాలం ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రజా ఆగ్రహం పెరగడంతో పర్యటనలు ప్రారంభించారా?" అని ప్రశ్నిస్తున్నారు.

కంగనా చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. ఆమెకు నిధుల నియంత్రణ శక్తి ఉండకపోవచ్చు. కానీ నిజమైన ప్రజా ప్రతినిధి కష్టకాలంలో కనిపిస్తా. తన శక్తి మేరకు ప్రజలకు అండగా ఉంటాడు. ప్రజల దృష్టిలో కేవలం సహాయం తెచ్చే మేధావిగా కాదు, మానవీయంగా స్పందించే నాయకుడిగా ఉండాలన్నది ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కంగనా మాటలకన్నా చర్యలే ముఖ్యం అనేది మండీ ప్రజల అభిప్రాయం.