Begin typing your search above and press return to search.

మేడం గారు కాస్త నిజాలు మాట్లాడండి

కంగనా నివాసం ఉండని ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వచ్చిందని వెంటనే ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   11 April 2025 12:01 PM IST
మేడం గారు కాస్త నిజాలు మాట్లాడండి
X

బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోనూ ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీని ప్రతి విషయంలోనూ టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్న కంగనా ఇటీవల కరెంట్ బిల్లు విషయమై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడికి, నిర్లక్ష్యంకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అంటూ ఒక రాజకీయ వేదిక మీద నుంచి కంగనా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తాను ఉండని ఇంటికి లక్ష రూపాయలు కరెంట్‌ బిల్లు వచ్చిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. ఆమె సినీ నటి కావడంతో ఆమె వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశం అయ్యాయి.

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ పరిపాలనపై, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులపై కంగనాతో పాటు పలువురు బీజేపీ నాయకులు సైతం విమర్శలు చేశారు. ఈ విషయమై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కంగనా నివాసం ఉండని ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వచ్చిందని వెంటనే ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను ప్రశ్నించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కంగనా చెప్పేవి మొత్తం అబద్దాలు అని సాక్ష్యాలతో సహా విద్యుత్‌ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్‌ వివరణ ఇచ్చారు.

కంగనా ఆరోపణలపై సందీప్ కుమార్ మాట్లాడుతూ... ఎంపీ కంగనా మేడం ఇంటికి ఈ నెల రూ.55 వేల బిల్లు వచ్చింది. అయితే గతంలో బిల్లు సకాలంలో చెల్లించని కారణంగా పాత బ్యాలెన్స్ ఉంది. ఆ మొత్తం కలిపి దాదాపు రూ.91 వేల బిల్లు వచ్చింది. మేడం గారు ఎప్పటికప్పుడు బిల్లు చెల్లించి ఉంటే ఈ స్థాయిలో బిల్లు వచ్చి ఉండేదే కాదు. ఆమె లక్ష రూపాయల బిల్లు అని చేసిన వ్యాఖ్యలు నిజం కాదు. నవంబర్‌, డిసెంబర్‌లో వచ్చిన బిల్లును చెల్లించిన ఎంపీ గారు ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన బిల్లును చెల్లించలేదు. గత నెలలో ఎంపీ మేడం ఇంట్లో 28 రోజుల్లోనే 9 వేల విద్యుత్‌ వినియోగం జరిగింది. అందుకే బిల్లు రూ.55 వేలు వచ్చింది.

ప్రభుత్వం నుంచి ఎంపీ గారికి రూ.700 లు సబ్సిడీ సైతం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయమై మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. ఎంపీ మేడం కరెంట్‌ బిల్లు చెల్లించకుండా, పాత బకాయిలు పెట్టి, అంతటితో ఆగకుండా ప్రభుత్వంను నిందిస్తున్నారు. ప్రజా వేదికలపై అబద్దాలు ప్రచారాలు చేస్తున్నారు. మేడం గారు కాస్త నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయడం ఏ మాత్రం సరికాదు అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. అధికారుల వివరణతో బీజేపీ నేతలు సైతం సైలెంట్‌ అయ్యారు. మరి కంగనా ఈ విషయమై ఏం స్పందిస్తుంది అనేది చూడాలి.