కాంగ్రెస్ సర్కారుపై నోరు పారేసుకొని అడ్డంగా బుక్ అయిన కంగనా
తనకు వచ్చిన కరెంటు బిల్లు గురించి చెబుతూ.. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయటం తెలిసిందే.
By: Tupaki Desk | 11 April 2025 12:42 PM ISTఅందుకే అంటారు.. ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు నోటికి వచ్చింది వచ్చినట్లుగా.. మనసుకు తోచింది తోచినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు. అందునా ఒక సభలో అందరి ముందు ఒక విషయాన్నిషేర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో ఏ మాత్రం పొరపాటు దొర్లినా మొదటికే మోసం వస్తుంది. కానీ.. ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్ కం మండి ఎంపీగా వ్యవహరిస్తున్న కంగనా రౌనత్ కు తాజాగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది.
తనకు వచ్చిన కరెంటు బిల్లు గురించి చెబుతూ.. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయటం తెలిసిందే. అయితే.. ఆమె చెప్పిన కరెంటు బిల్లు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రియాక్టు కాకుండా.. విద్యుత్ శాఖ అధికారులతో అసలు నిజాన్ని చెప్పించటం ద్వారా.. కంగనా నోటికి తాళం పడేలా చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంతో తెల్లారని కంగనా.. ఇటీవల ఒక ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అధికారపక్షమైన కాంగ్రెస్ పాలనను తప్పు పట్టేలా విమర్శించారు.
‘మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చింది. ఈ మధ్యన నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. ఆ బిల్లు చేసి షాక్ అయ్యా. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి సమస్యలపై మనమంతా పని చేయాలి. ఈ తోడేళ్ల చెర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కంగనా వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది.
ఇదిలా ఉంటే.. కంగనా వ్యాఖ్యల అనంతరం రంగంలోకి దిగారు విద్యుత్ శాఖ అధికారులు. ఆమెకు వచ్చిన బిల్లు మీద ఆరా తీశారు. అసలు విషయంతెలుసుకున్న వారు స్పందించారు.కంగనాకు వచ్చిన రూ.లక్ష కరెంటు బిల్లుపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. ‘ఆమెకు ఈ నెల వచ్చిన బిల్లు రూ.55 వేలు మాత్రమే. ఆమె గతంలో చెల్లించని బిల్లులకు కలిపి మొత్తం రూ.91వేలుగా బిల్లు ఇచ్చారు. సరైన సమయంలో బిల్లు చెల్లించి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదు. 28 రోజుల్లో మేడమ్ 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. అందుకే ఒక్క నెల బిల్లు రూ.55వేలు వచ్చింది. అందుకు సంబంధించిన లెక్కలు ఇవే’’ అంటూ మళ్లీ నోరెత్తి మాట్లాడని రీతిలో సమాధానం ఇచ్చేశారు ఆధారాలతో.
చివర్లో మరో ట్విస్టు ఏమంటే.. ఈ భారీ కరెంటు బిల్లులో రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అధికారుల వివరణ తర్వాత రంగంలోకి దిగారు రాష్టర మంత్రి విక్రమాదిత్య సింగ్. మేడమ్ కరెంటు బిల్లు చెల్లించరు కానీ ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారంటూ వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ప్రజావేదికలపై గోల చేస్తారని.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారన్న ఆయన మాటలకు కంగనా నుంచి ఎలాంటి కౌంటర్ లేని పరిస్థితి. కాస్త వెనుకా ముందు చూసుకొని మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితి కంగనాకు ఎదురయ్యేది కాదు కదా?
