Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ లాగా సినీ ప‌రిశ్ర‌మ‌ను చూశామా? : కందుల దుర్గేష్‌

సినీ ప‌రిశ్ర‌మ‌ను తాము జ‌గ‌న్ లాగా చూశామా? గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా వ్య‌వ‌హరించామా? అంటూ.. జ‌న సేన నాయ‌కుడు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   26 May 2025 3:31 PM IST
జ‌గ‌న్ లాగా సినీ ప‌రిశ్ర‌మ‌ను చూశామా? : కందుల దుర్గేష్‌
X

సినీ ప‌రిశ్ర‌మ‌ను తాము జ‌గ‌న్ లాగా చూశామా? గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా వ్య‌వ‌హరించామా? అంటూ.. జ‌న సేన నాయ‌కుడు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న రాజ‌మండ్రిలో మీడియా తో మాట్లాడారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇండ‌స్ట్రీ హోదా ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని.. కానీ.. ప్ర‌భుత్వాన్ని అవ‌మానించేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్‌గా స్పందించాల్సి వ‌చ్చింద‌న్నారు.

''సినిమా టికెట్ల రేట్ల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సినిమా థియేటర్లపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవం. కొంద‌రి చేతుల్లోనే సినిమా ప‌రిశ్ర‌మ బందీ అయిపోయింది. ఆయ‌న చెప్పింది నిజ మే. దీనినే మేం వ‌ద్దంటున్నాం. అంద‌రూ క‌లిసి వ‌చ్చి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తే.. ప‌రిష్కారాలు చూపేందుకు ప్ర‌భుత్వం సంసిద్ధంగా ఉంది. సినీరంగం అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు అడిగితే పెంచుతున్నాం.'' అని కందుల వ్యాఖ్యానించారు.

సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమ‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే.. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం సినీ ఇండ‌స్ట్రీని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసిందేన‌ని.. కానీ, కొంద‌రు ఆ విష‌యాన్ని మ‌రిచిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ''గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. టికెట్ల ధ‌ర‌లు పెంచాల‌ని కోరితే పెంచుతున్నాం. కానీ.. ప్ర‌భుత్వం ప‌ట్ల క‌నీస కృత జ్ఞ‌త ఉండాలి క‌దా'' అని అన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాసిన లేఖ‌లో డీజీపీని అవ‌మానించామంటూ.. కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ని.. అస‌లు అంత‌రార్థం తెలుసుకోకుండా కామెంట్లు చేసేవారిని ఏమ‌నాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సినిమా ఇండ‌స్ట్రీ పై అవ‌గాహ‌న లేని వారు చేసే కామెంట్ల‌ను ఎలా చూడాల‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాన్ని ప‌ట్టించుకోక‌ పోయినా.. తాము ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టించుకుని స‌హ‌క‌రిస్తున్న‌ట్టు తెలిపారు. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తున్న‌ట్టు మంత్రి చెప్పారు. వ‌చ్చే గోదావరి పుష్క‌రాల స‌మ‌యానికి ప‌ర్యాట‌కంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.


కందుల దుర్గేష్ గారు రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన


సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరం - రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్


ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా ఉంటాం.. సంపూర్ణ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని వెల్లడి

థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోంది.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం

అందరికీ ఆమోదయోగ్యంగా నూతన ఫిల్మ్ పాలసీ..సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి

తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదు

సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రిపై ఆగ్రహం

వక్రభాష్యాలు చెప్పేవాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితువు

గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు. సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్పష్టంగా వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. జూన్ 12న విడుదల కానున్న "హరిహరవీరమల్లు" చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం, కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని, చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను ఉపేక్షించమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

నూతన ఫిల్మ్ పాలసీతో అందరికీ ఆమోదయోగ్యం

సినిమా టికెట్ల రేట్లు పెంచమని సినీ రంగం నుండి నిర్మాతలు విడివిడిగా వచ్చి తమను కలుస్తారని, తాము కూడా అందుకు సరే అని చెబుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందన్నారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని భావించామన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే తాము రేట్ల పెంపుకు అనుమతిస్తున్నామన్నారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఇది సరైన విధానం కాదని సూచించారు. సినిమా రంగం వ్యాపారమని కొందరు మాట్లాడుతున్నట్లుగా సినిమా రంగానికి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. నిర్ణయాలు ఎందుకు చేశారని నిలదీశారు. తహసిల్దార్ లను థియేటర్ల దగ్గర పెట్టి రేట్లను ఎందుకు నియంత్రించారు అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఇక మీదటైనా అందరూ కలిసికట్టుగా, సరైన రీతిలో వ్యవహరించాలన్నారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది సహేతుకంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు.

సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి

సినీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. సినిమా తీయడం కోసం వేలాది మంది కృషి చేస్తారని, వందలాది మంది దీనిపై ఆధారపడుతున్నారన్న అంశం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సహకరిస్తూనే ఉన్నామన్నారు. సినిమా షూటింగ్ లకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. సినిమా టికెట్ పై రూపాయి పెంచితే ప్రభుత్వానికి 25 పైసలు జీఎస్టీ వస్తుందన్నారు. ఈ అంశాన్ని ఇటీవల రాజమహేంద్రరంలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఫ్రీరిలీజ్ వేడుకల్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే తరుచూ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా నిర్మాతలకు తాను ఒక లేఖ రాశానని, అంతా కలిసి కూర్చొని సినీరంగ సమస్యలు పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

వైసీపీ మాజీమంత్రి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి..పిచ్చి ప్రేలాపనలు తగదు

సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా అని ప్రశ్నించారు. డీజీపీని తామేదో అరెస్ట్ లు చేయమన్నామని వక్రభాష్యాలు చెప్పేవాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి వాతవరణం ఏంటని ప్రశ్నించామన్నారు. తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నామని, అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టతనిచ్చారు. తద్వారా భవిష్యత్ లో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడమే తమ ఉద్దేశమన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడటం సరికాదని తెలిపారు. జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని ఈ సందర్భంగా జంద్యాల వ్యాఖ్యలను ఉదహరించారు. రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ మాజీమంత్రి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మాజీ మంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. మాజీ మంత్రి ఆలోచన విధానమేంటి, ఆయనకు కనీస మానవత్వం ఉందా అన్నారు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథతో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ప్లాప్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పిచ్చి ప్రేలాపనలు తగదని హెచ్చరించారు. సినిమా అంటే ఆషామాషీ విషయం కాదని దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుందనే విషయం గ్రహించాలన్నారు. సినిమా విడుదల కాకముందే ఒక రకమైన జడ్జిమెంట్ ఇవ్వడమంటే వేలాది కుటుంబాల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. నాడు బాధ్యత గల మంత్రిగా పనిచేశావా అని ప్రశ్నించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా అలా మాట్లాడటం సరైనదేనా అన్నారు. సినిమా విడుదలకు ముందే హిట్లో ప్లాపో చెప్పేంత దైవాంశ సంభూతుడివా అన్నారు. ఒక అంశంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే చనిపోతే ఫర్వాలేదనే రాజకీయం నడుపుతున్నారంటే, ఆయన చావును బట్టే ఈ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని అన్నారంటే ఆయన చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా, ఆయన చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా తప్పు ఉంటే చట్టపరంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అంతే తప్ప ఎవరూ చనిపోవాలని కోరుకోవడం లేదన్నారు. సినిమా రంగంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే, అర్థరహితంగా వ్యాఖ్యలు చేస్తే అది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

సినీ రంగంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు

సినిమా అనే రంగాన్ని తాము ఉన్నతంగా చూస్తామన్నారు. అది ప్రజలకు వినోదాన్ని కలిగించే మాధ్యమంగా భావిస్తున్నామన్నారు. అంతేతప్ప గత ప్రభుత్వంలా తాము సినిమా హీరోలను, సినీ పెద్దలను కించపరమన్నారు. సినీ రంగంపై కక్ష సాధింపు చర్యలు తీసుకోబోమని స్పష్టతనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినీ రంగ ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించిన విషయం గుర్తుచేశారు. సినీ రంగ సమస్యలను పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉంటామని భరోసానిచ్చామన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను అందుబాటులో ఉంటానని నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. సినీ ఇండస్ట్రీలో కొందరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటాము అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడే ఈ విషయంపై సినిమా వారు స్పష్టతనిచ్చి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. సినిమా రంగం, ప్రభుత్వం మధ్య అనుకూలమైన వాతావరణం ఉన్న సమయంలో తమకు ఎవరితో ఏ అవసరం లేదని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ అనడం ఎంతవరకు సరైనదో ఆలోచించుకోవాలన్నారు. థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోందన్నారు.సినీ పరిశ్రమకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.

రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమిష్టి విజయం

తెలుగుభాషపై ఉన్న మక్కువతో నాటి సీఎం ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారని మంత్రి దుర్గేష్ ఆ ప్రస్థానాన్ని వివరించారు. అందుకు ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్లబుచ్చయ్య చౌదరి సహకరించారన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ అంశాన్ని కేబినెట్ దృష్టికి, సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తాను తీసుకెళ్లానన్నారు. ఇందులో సహజంగానే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందన్నారు. నిర్ణయం వచ్చిన వెంటనే కేబినెట్ కు సైతం ధన్యవాదాలు తెలిపామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమిష్టి విజయంగా భావిస్తున్నామన్నారు.

జారీ చేసిన వారు: పీఆర్వో, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు