వివాహేతర సంబంధాలు : ఢిల్లీ, ముంబై కాదు.. అదే టాప్
సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలు ముందుంటాయని భావిస్తారు. అయితే, ఈసారి తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురం అందరికంటే ముందు నిలిచింది.
By: Tupaki Desk | 23 July 2025 3:00 PM ISTఒకప్పటి భారతీయ కుటుంబ వ్యవస్థ, పెళ్లి బంధానికి ఉన్న గౌరవం ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కుటుంబ వ్యవస్థలు బలహీనపడటం, వ్యక్తిగత స్వేచ్ఛలు పెరగడం, జీవనశైలిలో మార్పుల వల్ల వివాహేతర సంబంధాలు శరవేగంగా పెరుగుతున్నాయని కెనడాకు చెందిన డేటింగ్ సంస్థ ఆష్లే మాడిసన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ షాకింగ్ ఫలితాల్లో కాంచీపురం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలు ముందుంటాయని భావిస్తారు. అయితే, ఈసారి తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురం అందరికంటే ముందు నిలిచింది. గత ఏడాది 17వ స్థానంలో ఉన్న కాంచీపురం కేవలం ఒక్క సంవత్సరంలోనే అగ్రస్థానానికి దూసుకురావడం విశేషం. ఈ మార్పునకు ప్రత్యేక కారణాలు వెల్లడించకపోయినా, ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, విలువల్లో వచ్చిన లోపాలు ఇందుకు కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఎందుకు పెరుగుతున్నాయి వివాహేతర సంబంధాలు?
సర్వేలో పాల్గొన్న వివాహితులు వివాహేతర సంబంధాల్లోకి జారడానికి పలు కారణాలు వెల్లడించారు. వాటిలో ప్రధానమైనవి..జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, ఆప్యాయత లేకపోవడం. భర్త లేదా భార్య తమను పట్టించుకోవడం లేదనే భావన. దాంపత్య జీవితంలో లైంగిక సంబంధిత సమస్యలు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేదా అసమానతలు. మద్యం లేదా ఇతర అలవాట్లకు, స్నేహితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. అవతలి వ్యక్తితో కేవలం స్నేహం పేరుతో సన్నిహితంగా ఉండటం కారణాలుగా చెబుతున్నారు. సర్వే ప్రకారం 53 శాతం మంది తాము వివాహేతర సంబంధంలో ఉన్నామని స్పష్టంగా అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, భారత్ దేశాల్లోనే ఈ సంబంధాలు అత్యధికంగా ఉన్నాయని ఆష్లే మాడిసన్ సంస్థ వెల్లడించింది.
-ఇతర పట్టణాలు, నగరాల స్థానం
కాంచీపురం తర్వాత వరుసగా సెంట్రల్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, జైపూర్, ఘజియాబాద్ వంటి ప్రాంతాలు టాప్ 10లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో డిజిటల్ యాక్సెస్, స్వేచ్ఛా భావాల పెరుగుదల వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయని సర్వే సూచిస్తోంది.
-ఆష్లే మాడిసన్ సంస్థపై వివాదాలు
ఆష్లే మాడిసన్ సంస్థ గతంలో 37 మిలియన్ల వినియోగదారుల డేటాను ఉల్లంఘించి వివాదాల్లో చిక్కుకుంది. డేటా లీక్ కేసు అనంతరం, మాతృసంస్థ రూబీ లైఫ్ ద్వారా భారతదేశంలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ సర్వేలు, మార్కెటింగ్ ద్వారా తమ మార్కెట్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వివాహేతర సంబంధాలపై విమర్శ చేయకపోవడం, వాటిని ప్రేమకు నిదర్శనంగా చిత్రీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
-సామాజిక సమస్యగా వివాహేతర సంబంధాలు
వివాహేతర సంబంధాల పెరుగుదల అనేది ఒక అపరిష్కృత సామాజిక సమస్య. దీనికి సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, అసలు సమస్య విలువల్లో వచ్చిన లోపమే. కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించేందుకు, సంబంధాల బలాన్ని పెంపొందించేందుకు వ్యక్తులుగా, సమాజంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
