కేసీఆర్ గుర్తుకు వచ్చేలా చేసిన కేంద్రమంత్రి గడ్కరీ సతీమణి
గడ్కరీ సతీమణి కాంచన్ ఆర్గానిక్ పద్దతిలో.. మల్చింగ్ పేపర్ టెక్నాలజీలో ఉల్లిపంటను పండించారు.
By: Tupaki Desk | 2 Jun 2025 12:00 AM ISTరాజకీయ నేతలు.. వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా రాజకీయాలతోనే వారి జీవితాలు ముడిపడి ఉంటాయి. వారు సాధించే విజయాలు సైతం రాజకీయాలతోనే ముడిపడి ఉంటాయి. అందుకు భిన్నంగా రాజకీయాలకు సంబంధం లేని అంశాల్లో కొందరు సాధించే ఘనతలు అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పనినే చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సతీమణి కాంచన్. ఆమె సాధించిన ఘనత గురించి తెలిసినంతనే తెలుగు వారికి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పున గుర్తుకు వస్తారు. ఇంతకూ గడ్కరీ సతీమణి సాధించిన ఘనత ఏమిటన్నది చూస్తే..
గడ్కరీ సతీమణి కాంచన్ ఆర్గానిక్ పద్దతిలో.. మల్చింగ్ పేపర్ టెక్నాలజీలో ఉల్లిపంటను పండించారు. ఆమె పండించిన ఉల్లి పంట ప్రత్యేకత ఏమంటే.. ఒక్కో ఉల్లిగడ్డ 800 గ్రాముల నుంచి కేజీ వరకు ఉండటం. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. తన భార్య కాంచన్ ను పరిచయం చేస్తూ.. ఆమె నాగపూర్ లోని ధపేవాడలోని తమ భక్తి ఫామ్ లో మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ప్రత్యేక ప్రయోగంతో ఉల్లి పంటను పండించారు. ఒక్కో ఉల్లి కేజీ వరకు బరువు ఉండటం వీరి ప్రత్యేకతగా చెప్పాలి.
సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన చేసిన పోస్టులో సదరు కేజీ ఉల్లిపాయితో పాటు.. పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలు నాటు వేయటం లాంటివి కూడా షేర్ చేశారు. వీరు పండించిన ఉల్లి సాధారణ ఉల్లికంటే చాలా పెద్దవిగా ఉండటం అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఇంతకూ మల్చింగ్ పేపర్ టెక్నాలజీ విషయానికి వస్తే.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పి.. దీనిపై చిన్న చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాడుతారు ఇలా వ్యవసాయం చేయటం ద్వారా వాటర్ వేస్టేజ్ ను తగ్గించొచ్చు. అంతేకాదు కలుపు మొక్కల్ని నివారించే వీలుంది.
ఆమె పండించిన ఉల్లి పంటకు సంబంధించిన విత్తనాల్ని ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు. ఆమె సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేసి ఘన విజయాన్ని సాధించారు. ఇక్కడే మరో విషయాన్నిచెప్పాలి. గులాబీ బాస్ కేసీఆర్ సైతం తన ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా పండించే క్యాప్సికం దగ్గర నుంచి కేరట్.. ఇతర కూరగాయలు.. పంటలకు ప్రత్యేక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. తాను వ్యవసాయం చేయటం ద్వారా ఏడాదికి కోటి రూపాయిలు సంపాదించినట్లుగా అప్పట్లో చెప్పిన కేసీఆర్ మాటలు సంచలనంగా మారటం తెలిసిందే. గడ్కరీ సతీమణి సాధించిన ఘనత గురించి తెలిసినంతనే కేసీఆర్ చప్పున గుర్తుకు రావటం ఖాయం.
