రెండు పార్టీల మధ్య ఘర్షణ.. కామారెడ్డిలో హై టెన్షన్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం.. క్షణాల్లోనే ఉద్రిక్తతగా మారి వాహన ధ్వంసం దాకా వెళ్లింది.
By: Tupaki Political Desk | 21 Feb 2026 3:05 PM ISTరాజకీయాలు సిద్ధాంతాల మధ్య పోటీగా ఉండాలి. కానీ వీధుల్లో బాహా బాహీకి దిగేలా ఉండకూడదు. కానీ చాలా సందర్భాల్లో అవి వీధుల్లో ఘర్షణకు దారి తీస్తున్నాయి. కామారెడ్డిలో చోటుచేసుకున్న తాజా ఘటన అలాంటి ఆందోళనకర పరిణామమే. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం.. క్షణాల్లోనే ఉద్రిక్తతగా మారి వాహన ధ్వంసం దాకా వెళ్లింది. ప్రజాస్వామ్య సంస్కృతిలో ఇలాంటి ఘటనలు ఇస్తున్ సందేశం ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
బీజేపీ నేతపై ఎమ్మెల్యే ఆరోపణలు..
కామారెడ్డి బీజేపీ నేత వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై వెంకట రమణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు నిరాధారమని ఖండిస్తూ, నిజానిజాల నిర్ధారణకు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. మాటల పరస్పర దాడి పెరిగిన కొద్దీ కార్యకర్తల భావోద్వేగాలు కూడా ఉప్పొంగాయి.
ఎమ్మెల్యే కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి చెందిన కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన పరిస్థితిని మరింత వేడెక్కించింది. రాజకీయ వాదోపవాదాలు చట్టపరమైన మార్గాల్లో కొనసాగాలి గానీ, ఆస్తి ధ్వంసం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలతో ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు.
దాడులకు దిగడం సరైంది కాదు..
రాజకీయ ఆరోపణలకు సమాధానం వీధి హింసేనా? అవినీతి ఆరోపణలు చేస్తే వాటిని చట్టపరంగా, ఆధారాలతో ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అదే విధంగా ఆరోపణలు చేసే వారూ బాధ్యతతో వ్యవహరించాలి. రాజకీయ ఆరోపణల చేయడంతోనే సరికాదు.. దానికి తగ్గ సాక్షాలను ఎంతో కొంత చూపించాలి. ప్రజా ప్రతినిధుల మాటలు కార్యకర్తలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్న విషయాన్ని నాయకులు మరువద్దు. ఒక మాట.. ఒక సవాల్.. ఒక వ్యాఖ్య.. వందలాది మంది భావోద్వేగాలను రగిలించగలదు.
వెంకట రమణారెడ్డి నిజానిజాల నిర్ధారణకు సిద్ధమని ప్రకటించడం రాజకీయంగా మంచి నిర్ణయం. అయితే అదే సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలకు నియంత్రణ సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు రాజకీయాల్లో సాధారణం. కానీ అవి చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కారం కావాలి.
స్థానికంగి టెన్షన్ వాతావరణం..
ఈ ఘటనపై స్థానికంగా ఇప్పటికే టెన్షన్ వాతావరణం నెలకొంది. చిన్న ఘటన కూడా పెద్ద ఘర్షణకు దారి తీసింది. అందుకే పరిపాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలు తమ అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు, వీధి ఘర్షణలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.
కామారెడ్డి ఘటన ఒక హెచ్చరికలా చూడాలి. ప్రజాస్వామ్యం అనేది భిన్నాభిప్రాయాలను గౌరవించే వ్యవస్థ. అక్కడ వాదనలు ఉండాలి, ఆధారాలు ఉండాలి, చట్టపరమైన విచారణ ఉండాలి. కానీ హింసకు స్థానం ఉండకూడదు. రాజకీయ నాయకులు మాటల్లో పరిమితి పాటిస్తేనే కార్యకర్తలు కూడా అదుపులో ఉంటారు. ఈ ఉద్రిక్తత ఇక్కడితో ఆగాలి. ఆరోపణలు నిజమైతే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. నిరాధారమైతే అవి తుడిచిపెట్టుకుపోవాలి. కానీ ప్రజల భద్రత, సామాజిక శాంతి దెబ్బతినకూడదు. రాజకీయాలు ప్రజల కోసం.. ప్రజలపై కాదు అనే సత్యాన్ని ప్రతి పార్టీ గుర్తుంచుకోవాల్సిన సమయం ఇదే.
