Begin typing your search above and press return to search.

ఒక్కచోటే 40 సెం.మీ. వ‌ర్షం.. కామారెడ్డి మునిగింది.. మెద‌క్ వ‌ణికింది

కామారెడ్డి జిల్లా రాజంపేట మెద‌క్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. రాజంపేట‌లో ఏకంగా తెలుగురాష్ట్రాల చ‌రిత్ర‌లో లేనంత‌గా 40 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది.

By:  Tupaki Desk   |   27 Aug 2025 11:47 PM IST
ఒక్కచోటే 40 సెం.మీ. వ‌ర్షం.. కామారెడ్డి మునిగింది.. మెద‌క్ వ‌ణికింది
X

వామ్మో ఇదేమి వాన... ఎక్క‌డైనా 10 సెంటీమీట‌ర్లు ప‌డుతుంది.. 20 సెంటీమీట‌ర్లు ప‌డుతుంది.. కానీ, ఇక్క‌డ ఒక్క‌చోటే 40 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది... దీంతో తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లా మునిగింది.. దీనిప‌క్క‌నే ఉండే మెద‌క్ జిల్లా వ‌ణికింది..! ఆకాశానికి చిల్లుప‌డ్డ‌ట్లు.. ఏక‌ధాటిగా వాన కుర‌వ‌డంతో ఈ రెండు జిల్లాల్లో జ‌న జీవ‌నం స్తంభించిపోయింది. అంతేకాదు.. అల్ప పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం రాత్రి నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాను అయితే వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేశాయి.

క‌నీవినీ ఎరుగ‌ని వాన‌

కామారెడ్డి జిల్లా రాజంపేట మెద‌క్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. రాజంపేట‌లో ఏకంగా తెలుగురాష్ట్రాల చ‌రిత్ర‌లో లేనంత‌గా 40 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. ఈ ప్ర‌భావం మెద‌క్ జిల్లాపై ప‌డింది. అటు నిజామాబాద్ జిల్లాను కూడా వ‌ర్షాలు వ‌ణికించాయి.

-1.30 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు బుధ‌వారం సాయంత్రం పోచారం ప్రాజెక్టు పైనుంచి ప్ర‌వహించింది. మెద‌క్-ఎల్లారెడ్డి ప్ర‌ధాన రహ‌దారిపై వ‌ర‌ద నిలిచింది. పోచారం రిజ‌ర్వాయ‌ర్ పైనే 6 అడుగుల నీరు ప్ర‌వ‌హించ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను నిద‌ర్శ‌నం.

యువ వైద్యుడి దుర్మ‌ర‌ణం.. మెద‌క్ లో చాలాచోట్ల 20 సెం.మీ.పైనే...

రాజంపేట‌లో దేవుని చెరువు క‌ట్ట తెగి.. ఇంట్లోకి నీరు చేర‌డంతో గోడ‌కు రంధ్రం వేయ‌బోయిన యువ వైద్యుడు విన‌య్ (28) అదే గోడ కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇక మెద‌క్ జిల్లాలోని చాలా మండ‌లాల్లో 20 సెం.మీ. పైనే వ‌ర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి రాక‌పోక‌లు నిలిచాయి.

తండానే మునిగింది... ఊరు చిక్కుకుంది

మెద‌క్ జిల్లాలో హ‌వేలీ ఘ‌న‌పూర్ మండ‌లంలోని దూప్ సింగ్ తండా నీట‌ మునిగింది. పెద్ద‌శంక‌రంపేట‌లో 20.4, టేక్మాల్ మండ‌లం బోడ‌గ‌ట్టులో 20.1, హ‌వేలీ ఘ‌న‌పూర్ మండ‌లం స‌ర్ద‌న‌లో 16.1, రామాయంపేట‌లో 17.9, నార్సింగిలో 16.5, పాప‌న్న‌పేట మండ‌లం లింగాయిప‌ల్లిలో 15.5 సెం.మీ. వ‌ర్షం కురిసింది. రామాయంపేట ప‌ట్టణం జ‌ల దిగ్బంధంలో చిక్కుకుంది. మెద‌క్ లో ప‌లు కాల‌నీలు నీట మునిగాయి. రామాయంపేట‌-సిద్దిపేట మ‌ధ్య జాతీయ ర‌హ‌దారి పైకి వ‌ర‌ద చేరి రాక‌పోక‌లు నిలిచాయి.

-గ‌జ్వేల్ ను సైతం వ‌ర్షం అత‌లాకుతలం చేసింది. గ‌జ్వేల్-ప్ర‌జ్ఞాపూర్ మ‌ధ్య ర‌హ‌దారిపైకి వ‌ర‌ద చేరింది. సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ఆవ‌లి వైపు ప‌శువుల‌ను మేపేందుకు వెళ్లిన ఐదుగురు చిక్కుకుపోయారు.