Begin typing your search above and press return to search.

కమల్ ప్రశ్న: సినిమాలు ఎందుకు వదిలేయాలి?

ఈ నేపథ్యంలో విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్‌ను అడిగితే.. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన సినిమాలకు దూరం కావాల్సిన అవసరం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:00 PM IST
కమల్ ప్రశ్న: సినిమాలు ఎందుకు వదిలేయాలి?
X

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్లలో కొందరు పూర్తిగా సినిమాలను విడిచిపెడతారు. కానీ కొందరు మాత్రం సినిమాల్లో కొనసాగుతూనే.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. ఐతే ఒక నటుడు తనే సొంతంగా పార్టీ పెట్టి నాయకత్వం వహించాలని భావించినపుడు మాత్రం సినిమాలను వదిలేయడమే బెటర్ అన్నది మెజారిటీ అభిప్రాయం.

ఐతే తమిళనాట మక్కల్ నీది మయం అనే పార్టీ పెట్టి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న కమల్ హాసన్.. ఎన్నికల్లో వైఫల్యం తర్వాత తిరిగి సినిమాల బాట పట్టాడు. అలా అని పార్టీనేమీ మూసేయలేదు. ఏదో నామమాత్రంగా పార్టీ కార్యకలాపాలు నడుస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుని మక్కల్ నీది మయం తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు తమిళనాట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటూ కొత్త పార్టీని ప్రకటించిన విజయ్.. ఇంకో సినిమా చేసి నటనకు దూరం కావాలనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్‌ను అడిగితే.. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన సినిమాలకు దూరం కావాల్సిన అవసరం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తూనే.. సినిమాలకు దూరం కావాలన్నది తన సొంత నిర్ణయమని.. అందరూ అలా చేయాలనేమీ లేదని అన్నారు కమల్. ‘‘రాజకీయాల్లోకి రాబోతున్న విజయ్‌కి శుభాకాంక్షలు.

అతను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన వాళ్లలో నేనూ ఉన్నా. దీని గురించి మేం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఒక రంగంలో కొనసాగాలంటలే ఇంకో రంగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాలా సినిమాలా అనేది విజయ్ వ్యక్తిగత అభిప్రాయం. ఆయన సినిమాల్లో వైవిధ్యం ఉంటుంది. కానీ ఆయనలా నన్ను చేయమంటే ఎలా? ఎవరి సామర్థ్యం వారిది. నేనైతే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను’’ అని కమల్ స్పష్టం చేశారు.