ఆంధ్రకు అండగా కమల్ హాసన్.. ఏ విషయంలో అంటే..?
మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2025 3:42 PM ISTమక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క భాషా వివాదంలోనూ చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన జాతీయ విద్యావిధానం (ఎన్.ఈ.పీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ విషయంలో తమిళనాడు సీఎం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అవును... త్రిభాషా సూత్రం అమలుపై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ స్పందించారు. ఇందులో భాగంగా... పాఠశాలల్లో ఒక నిర్దిష్టమైన భాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దడం వల్ల అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని కమల్ అన్నారు. ఈ విషయంలో తాను ఏపీకి అండగా నిలుస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన కమల్ హాసన్... విద్య విషయంలో విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని.. ఒక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి అంటే స్పానిష్, చైనీస్ ఏదైనా నేర్చుకోవచ్చని.. దేశంలో ఎన్నో ఏళ్లుగా ఇంగ్లిష్ విద్య స్థిరంగా కొనసాగుతోందని.. దాన్ని ఒక్కసారిగా భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించారు.
ఇందులో భాగంగా.. తమపై హిందీని బలవంతంగా రుద్దితే మా మాతృ భాష ఏమవ్వాలి.. దేశంలో ఉన్న 22 అధికారిక భాషల్లో తమిళం ఒకటి కాదా? అని కమల్ ప్రశ్నించారు. ఈ విషయంలో తమిళనాడు మాత్రమే కాకుండా.. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లకు అండగా నిలుస్తానని అన్నారు.
కాగా జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్, ఒక స్థానిక భాషను నేర్చుకొవాలని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని తమిళనాడు అధికార డీఎంకే స్పష్టం చేసింది. ఈ విషయంలో స్టాలిన్ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.
అయితే... ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో ఆ విషయంలో కమల్ హాసన్ సహాయసహకారాల అవసరం అక్కడ ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు!
