విశ్వ నాయకా...వితండమేలా ?
ఆయన సందర్భం చూసుకుని అన్నారో లేక యధాలాపంగా అన్నారో తెలియదు కానీ తమిళం నుంచి కన్నడం పుట్టింది అన్నారు.
By: Tupaki Desk | 4 Jun 2025 9:17 AM ISTఆయన భారత దేశం గరించే నటుడు. విశ్వ నటుడిగా పేరు ఉంది. లోక నాయకుడిగా కీర్తి ఉంది మూడేళ్ళ ప్రాయం నుంచి నటననే శ్వాసిస్తూ నటుడిగా తరిస్తూ ఏడున్నర పదుల వయసుకు చేరువ అవుతున్నారు. ఆయనే కమల్ హాసన్. ఆయన తమిళనాడుకు చెందిన వారు అయినా విశ్వ నటుడిగానే కళా ప్రపంచం గుర్తించింది.
ఆయనకు ఎల్లలు లేవు అనుకుంది. హద్దులు అంతకంటే అడ్డు రావనుకుంది. అయితే విశ్వనటుడు పెద్దల సభ అయిన రాజ్యసభకు ఎంపిక అవుతున్న వేళ సినీ రంగంలో ఉంటూ సామాజిక సమస్యల మీద తన గళం విప్పుతూ జన చైతన్యాన్ని కోరుకుంటున్న వేళ ఆయన నుంచి రావాల్సిన మాట అది కాదనే అంటున్నారు.
ఆయన సందర్భం చూసుకుని అన్నారో లేక యధాలాపంగా అన్నారో తెలియదు కానీ తమిళం నుంచి కన్నడం పుట్టింది అన్నారు. అయితే ఆయన సానుకూల దృక్పధంతోనే ఈ కామెంట్ చేశానని అంటున్నారు. కానీ తమిళుల మాదిరిగానే కన్నడిగులకు కూడా భాషాభిమానం మెండుగా ఉంటుంది అన్నది ఆయన మరచారు. ఆ మాటకు వస్తే ఎవరి మాతృ భాష వారికి గొప్ప.
ఆ విషయంలో అన్నీ తెలిసిన కమల్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన యధాలాపంగా అన్నారు అనుకున్నా అవతల వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని గ్రహించినపుడు వెంటనే పొరపాటు అయింది అని చెప్పి ఉంటే వ్యవహారం ఇంతదూరం వచ్చి ఉండేది కాదని అంటున్నారు. పైగా ఆయన తాను ఏమీ తప్పు చేయలేదని వితండ వాదన చేయడమే విడ్డూరంగా ఉంది అని అంటున్నారు.
ఇక కర్ణాటకలో ఆయన తాజాగా నటించిన చిత్రం థగ్ లైఫ్ సైతం వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఆ మూవీని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటామని అక్కడ సంఘాలు ప్రకటించాయి. ఇక కమల్ హాసన్ అయితే కన్నడ హైకోర్టులో సైతం సినిమా రిలీజ్ కోసం పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు సైతం కమల్ వ్యాఖ్యలను తప్పు పట్టింది.
మీరు ఏమైనా చరిత్రకారులా అని ప్రశ్నించింది. క్షమాపణ చెప్పాలని సూచించింది. అయితే ఎక్కడా తగ్గేది లేదని అదే మంకు పట్టుతో వ్యవహరిస్తున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ఆయన అంటున్నారు. తమిళం నుంచే కన్నడం పుట్టింది అనడం ఏ విధంగా ఒప్పుగా ఉందో ఆయనే చెబితే బాగుండేది కదా అంటున్నారు.
నిజానికి భాషావేత్తలు కానీ చారిత్రక వేత్తలు కానీ తరచి చూస్తే కన్నడ భాష చాలా ప్రాచీనమైనదిగా ఉందని ఆధారాలతో పాటుగా చెబుతున్నారు. అంతే కాదు కన్నడ భాషకు మూడు వేల ఏళ్ళ చరిత్ర ఉందని అంటున్నారు. మరి దానిని బట్టి అయినా కమల్ హాసన్ తన వ్యాఖ్యలు తపో ఒప్పో విశ్లేషించుకోవచ్చు కదా అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ వయసులో పెద్ద వారు. సీనియర్ సిటిజన్. అన్నీ తెలిసిన వారు. రేపటి రోజున పెద్దల సభలో ఆయన ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంది. అది ఎంతో వైవిధ్యభరితమైన భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేటట్టుగా ఉండాల్సి ఉంది. ఇక ప్రజాస్వామ్యం మీద తనకు ఎంతో గౌరవం అని ఆయన అంటారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ ఎంత హక్కుగా ఉందో అవతల వారి మనోభావాలను గౌరవించడం అంతే స్థాయిలో ఉంటుందని కమల్ వంటి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
మొత్తానికి చూస్తే తన థగ్ లైఫ్ సినిమాను అవసరమైతే రిలీజ్ చేయకుండా మానుకుంటాను కానీ క్షమాపణలు చెప్పను అన్న కమల్ తీరు పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఆయన విశ్వనటుడుగా ఉన్నారు అన్నది మరవరాదని సూచనలు వస్తున్నాయి. మంచి ప్రతిభ కలిగిన నటుడిగా ఉంటూ సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ స్పోర్టిఫ్ నెస్ ని కూడా కీలకమైన సమయాల్లో చూపించాల్సి ఉందని అంటున్నారు.
తను అన్న మాటలో తప్పు లేదని కమల్ భీష్మించుకున్నారు. అయితే ఇది చిన్న సమస్యగానే ఉండదు, ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆయనకే ఇబ్బంది అవుతుందన్న సూచనలు వస్తున్నాయి. మొత్తానికి కమల్ హాసన్ ఈ తరహా వివాదాలలో ఎపుడూ చిక్కుకోలేదు. కానీ తొలిసారి ఆయన ఇలా కార్నర్ అయ్యారో లేక చేశారో తెలియదు కానీ ఆయన తాజా సినిమా కంటే ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది.
