Begin typing your search above and press return to search.

కొడుకు కోసం తిరుమల శ్రీవారికి తలనీలాలు అర్పించిన పవన్ సతీమణి

అతి పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ కొడుకు కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమలేషుడిని దర్శించుకొని తన మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేవారు.

By:  Tupaki Desk   |   14 April 2025 10:10 AM IST
DCM Kalyan’s Wife Anna Tonsures Hair In Tirumala
X

అతి పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ కొడుకు కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమలేషుడిని దర్శించుకొని తన మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అన్నా కొణిదల తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆమె, టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తరువాత పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులతో పాటు శ్రీమతి అన్నా కొణిదల గారు తలనీలాలు సమర్పించారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడటంతో, తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లు భావించి ఆమె ఈ మొక్కును చెల్లించుకున్నారు.

సోమవారం వేకువజామున శ్రీమతి అన్నా కొణిదల గారు సుప్రభాత సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి తమ కుమారుడితో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం అన్నా కొణిదల గారు ఒక్కరే తిరుమలకు చేరుకున్నారు. ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు.

మొత్తానికి, తమ కుమారుడికి కలిగిన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో శ్రీమతి అన్నా కొణిదల గారు భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం విశేషం.

సింగపూర్ వేసవి శిబిరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో గాయపడ్డారు. ఒక పాఠశాల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒకరు మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పిల్లలు ఉన్నారు. సింగపూర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు మరియు మార్క్ శంకర్‌తో పాటు ఇతరులను రక్షించారు. మార్క్ శంకర్‌కు ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్య చికిత్స అందించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే, చిరంజీవి - పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి సింగపూర్ బయలుదేరారు. తన కుమారుడికి స్వల్ప గాయాలే అయ్యాయని మొదట భావించినప్పటికీ, అది పెద్ద ప్రమాదమని తర్వాత తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మార్క్ శంకర్‌కు బ్రాంకోస్కోపీ నిర్వహించారని, శ్వాసనాళాలు- ఊపిరితిత్తులలో పొగ చేరడం వల్ల ప్రత్యేక పరికరంతో వైద్యులు పరీక్షలు చేశారని ఆయన వివరించారు. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఉండవచ్చని కూడా పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు, పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. కుమారుడు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడితే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని అన్నా కొణిదల మొక్కుకున్నారు. ఆ మొక్కు తాజాగా తీర్చుకున్నారు.