Begin typing your search above and press return to search.

అన్ని ప్రశ్నలకు మౌనమే కవిత సమాధానం !

రెండువైపుల వాదోపవాదాలు విన్న రౌస్ ఎవిన్యు కోర్టు ఏడురోజుల పాటు కస్టడీ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   18 March 2024 8:19 AM GMT
అన్ని ప్రశ్నలకు మౌనమే కవిత సమాధానం !
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా జరిగిన మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కల్వకుంట్ల కవితను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించింది. శుక్రవారం హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే ఆమెను ఈడీ, ఐటీ శాఖల ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. తర్వాత విచారణ నిమిత్తం రాత్రికి రాత్రే ఢిల్లీకి తీసుకెళ్ళారు. శనివారం ఉదయం కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కస్టడీకి కోరింది. రెండువైపుల వాదోపవాదాలు విన్న రౌస్ ఎవిన్యు కోర్టు ఏడురోజుల పాటు కస్టడీ ప్రకటించింది.

ఆ కస్టడీ మొదటిరోజులో భాగంగా ఆదివారం ఉదయం నుండి రాత్రివరకు ఈడీ అధికారులు కవితను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిసిందే. ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సమాధానమిచ్చిన కవిత చాలా ప్రశ్నలకు అసలు నోరిప్పలేదట. కవిత పెట్టుబడులు, వ్యాపారాలు, వ్యాపారాల్లోకి వచ్చిన పెట్టుబడులు ఎక్కడినుండి వచ్చాయి ? లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం లాంటి అనేక విషయాలపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినట్లు సమాచారం.

లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, ప్రమేయానికి సంబంధించిన అనేక సాక్ష్యాలను ఈడీ ఉన్నతాధికారులు కవితకు చూపించారట. అయితే వాటిపై కవిత ఏమీ మాట్లాడలేదని తెలిసిందే. చాలా ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పకపోతే ఇక మిగిలిన ఆరురోజుల విచారణలో ఏమి సమాధానాలు చెబుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవిత వ్యవహారం చూస్తుంటే ఈడీ అదుపులో ఎన్నిరోజులున్నా ఎలాంటి ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. మహాయితే ఏడురోజుల కస్టడీ ముగియగానే నిందితురాలు విచారణలో సహకరించలేదని చెప్పి మళ్ళీ కస్టడీని పొడిగించాలని పిటీషన్ వేసే అవకాశాలున్నాయి.

అయితే కస్టడీని పొడిగించినా కూడా పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే ఈడీ చూపించిన ఆధారాలపై ఎలాంటి సమాధానాలు చెప్పలేదంటేనే ఆమె మౌనం అంగీకారమని అర్ధమవుతోంది. అయితే కవిత మౌనాన్ని అంగీకారమని కోర్టు అంగీకరించదు. కాబట్టి కవిత అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్కామ్ లో, మనీల్యాండరింగ్ ఆరోపణలకు తిరుగులేని ఆధారాలను కోర్టులో చూపిస్తేనే ఉపయోగముంటుంది. లేకపోతే కవితను అరెస్టుచేశారని మాత్రమే ఈడీ చెప్పుకునేందుకు ఉపయోగపడుతుంది.