లక్ష్మీపార్వతి.. విజయశాంతి.. వైఎస్ షర్మిల.. కవిత వంతు
తెలుగు రాష్ట్రాలలో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది.. ఇలాంటివారు అందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చినవారే.
By: Tupaki Desk | 2 Sept 2025 8:00 PM ISTతెలుగు రాష్ట్రాలలో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది.. ఇలాంటివారు అందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చినవారే. అయితే ఎవరూ సొంతంగా సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలను విలీనం చేయడమో, లేక వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంతు వంతు వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ అయిన కవితను ఇప్పుడు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తర్వాత ఏం చేస్తారు? అన్నది చర్చనీయంగా మారింది.
సొంత పార్టీ ఖాయమా?
తెలంగాణ జాగృతి... ఈ ప్రాంత కల్చర్ ను నిలిపేందుకు కవిత ఏర్పాటు చేసిన సంస్థ. మొన్నటివరకు ఇదే సంస్థ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు కవిత. అప్పటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాలేదు కాబట్టి ఆమె ఏం చేస్తారు? అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం కవిత సొంతంగా పార్టీ పెడతారని.. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (టీబీఆర్ఎస్) దాని పేరు అని అంటున్నారు. ఇదే నిజమైతే.. కవిత తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ పెట్టిన నాలుగో ప్రముఖ మహిళ అవుతారు.
అన్నగారి పేరిట
దివంగత మహా నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి తెలుగు రాజకీయాల్లో ఒక దశలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే, అది కొంతకాలమే. చంద్రబాబు సారథ్యంలో 1995లో ఎన్టీఆర్ అంతటి నేతను పదవీచ్యుతుడిని చేయడానికి పరోక్షంగా లక్ష్మీపార్వతి పెత్తనమే కారణం అని చెబుతుంటారు. చంద్రబాబు టీడీపీనీ తన వశం చేసుకున్నాక.. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంను స్థాపించారు. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగానూ గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ ప్రభావం తగ్గింది. లక్ష్మీ పార్వతి స్వయంగా 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశంను 2016లో భారత ఎన్నికల సంఘం
జాబితా నుంచి తొలగించింది.
తల్లి తెలంగాణ అంటూ..
సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయశాంతి 1996 నుంచే రాజకీయాల వైపు మొగ్గారు. 1998లో ఏడాది బీజేపీలో చేరారు. మధ్యలో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. 2005లో తల్లి తెలంగాణ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. చివరకు 2009లో మెదక్ నుంచి ఎంపీగా టీ(బీ)ఆర్ఎస్ తరఫున గెలిచారు. తెలంగాణ వచ్చేనాటికి ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు విజయశాంతి అయితే మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ, ఆమె 2014 నాటికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో కొనసాగారు. మళ్లీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. తన తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు రికార్డుల్లో ఉంది.
నాన్న చూపిన బాటలో...
ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల 2021లో వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్న జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆస్తుల కోసం ఆయనతో విభేదించి.. సొంత పార్టీని అదీ తెలంగాణలో నెలకొల్పారు షర్మిల. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనికితోడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ షర్మిల రాజకీయంగా కలకలం రేపారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా షర్మిల ప్రకటించారు. కానీ, ఎన్నికల కు ముందు ఆమె అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
మరి కవిత ఆలోచన ఏమిటో..?
కవిత.. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (టీబీఆర్ఎస్) పేరిట సొంత పార్టీని పెడతారని అంటున్నారు. ఇప్పటికే ఆమెను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (తెబొగకాసం) గౌరవ అధ్యక్షురాలిగా తొలగించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. గత ఆదివారం హెచ్ఎంఎస్ (హిందూ మజ్దూర్ సంఘ్) గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎలాగూ సొంత సంస్థ ఉంది. వీటిలో కవిత ఏ పేరుతో పార్టీ నెలకొల్పుతారో చూడాలి. పార్టీ పెడితే గనుక తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన నాలుగో ప్రముఖ మహిళ అవుతారు.
వారికి బలం.. కవితకు గళం..
లక్ష్మీపార్వతి.. ఎన్టీర్ మరణం తాలూకు సానుభూతితో కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. విజయశాంతి సినీ గ్లామర్- తెలంగాణవాదంతో మనుగడ సాగించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే, ఎంపీ-ఎమ్మెల్సీ అయ్యారు. షర్మిలకు తన తండ్రి ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. వీరందరికీ ఎంతో కొంత రాజకీయ బలం అండగా వచ్చింది. వీరి స్థాయిలో కవితకు పార్టీ బలం అండగా లేదనే చెప్పాలి. కాకపోతే వారికంటే కవితలో ఉన్న బలం.. ఆమె గళం.. మంచి వాగ్ధాటి ఉన్న కవిత... విషయాన్ని పిన్ పాయింట్ గా చెప్పగలరు. మరి ఎంతవరకు ముందుకెళ్తారో చూద్దాం..!
