కేసీఆర్ దేవుడు...లేఖ బహిర్గతం చేసింది ఒక కుట్రదారుడు
అయితే ఈసారి మాత్రం తన లేఖ బహిర్గత్గం అయింది. అని అలా తాను కేసీఆర్ కి మాత్రమే ఉద్దేశించి రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
By: Tupaki Desk | 23 May 2025 11:33 PM ISTగత ఇరవై నాలుగు గంటలుగా తెలంగాణా రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న కల్వకుంట్ల కవిత రాసిన లేఖ మీద ఇపుడు ఆమె స్వయంగా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె కోసం అక్కడికి చేరుకున్న మీడియాను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
తాను కేసీఆర్ కి రాసిన లేఖ నిజమే అని ఆమె అంగీకరించారు. అయితే తమ పార్టీ అధినేత అయిన కేసీఆర్ కి లేఖ రాయడం పూర్తిగా అంతర్గతమైన వ్యవహారం అని ఆమె అన్నారు. పార్టీలో ఉన్న పరిస్థితుల మీద తాను గతంలోనూ ఇలాగే అంతర్గతంగా లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
అయితే ఈసారి మాత్రం తన లేఖ బహిర్గత్గం అయింది. అని అలా తాను కేసీఆర్ కి మాత్రమే ఉద్దేశించి రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆ కుట్రదారుడు ఎవరు అని ఆమె నిలదీశారు. తాను కొద్ది రోజుల క్రితమే చెప్పాను అని ఆమె అంటూ కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ చుట్టూ జరుగుతున్నాయని ఆమె అన్నారు.
కేసీఆర్ ఒక దేవుడని ఆమె కొనియాడారు. ఆయన చుట్టూ మాత్రం దెయ్యాలు ఉనాయని అన్నారు. కొందరు కోవర్టులుగా చేరి ఈ లేఖను లీక్ చేశారని ఆమె మండిపడ్డారు. ఇక తనకు వ్యక్తిగతమైన అజెండా ఏమీ లేదని పార్టీ గురించిన నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ తాను అధినేతకు లేఖ రాయడం సాధారణ విషయమే అని ఆమె తేల్చేశారు. అయితే ఆ లేఖ బయటకు రావడమే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, ఈ సంగతిని పార్టీ వాదులతో పాటు తెలంగాణావాదులు, ప్రజలు కూడా గమనించాలని ఆమె కోరారు. తాను అంతర్గతంగా రాసిన లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. పార్టీలోని కొందరు కోవర్టులే ఈ లేఖను లీక్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అంతే కాదు ఎప్పటికీ కేసీఆరే తమ నాయకుడని ఆయన నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని కవిత గట్టిగా చెప్పుకొచ్చారు. అయితే పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లుగా ఆమె ఒక కొస మెరుపు మెరిపించారు. అంటే పార్టీ సరైన దారిలో నడవడం లేదని ఆమె భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆమె కేసీఆర్ మాత్రమే తమ నాయకుడు అనడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వం అంగీకరించేది లేదని చెప్పడం ఆమె ఉద్దేశ్యమా అన్న చర్చ కూడా వస్తోంది.
ఏది ఏమైనా కవిత లేఖ బయటకు రావడంతో గులాబీ పార్టీలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కవిత మాత్రం దేనికీ బెదిరేది లేదన్నట్లుగానే నిబ్బరాన్ని ప్రదర్శించడం ఆమె మీడియా సమావేశంలో కనిపించింది. దాంతో బీఆర్ ఎస్ లో రానున్న రోజులలో మరిన్ని పరిణామాలు రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటాయని అంతా అంటున్నారు. మరో వైపు చూస్తే కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
