Begin typing your search above and press return to search.

జర్నలిజమా? శాడిజమా? కాంగ్రెస్ లోకి వార్తలపై కవిత ఫైర్

కల్వకుంట్ల కవిత రాసిన లేఖలను మొదట్లో కొంతమంది గులాబీ నేతలు డ్రామా అని కొట్టిపారేశారు.

By:  Tupaki Desk   |   28 May 2025 6:54 PM IST
జర్నలిజమా? శాడిజమా? కాంగ్రెస్ లోకి వార్తలపై కవిత ఫైర్
X

"కాంగ్రెస్‌తో రాయబారం", "సముచిత ప్రాధాన్యం ఇస్తే సరి.. లేకుంటే కొత్త పార్టీ" అంటూ ఓ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు, ఆమె కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారనే కథనాలు జనాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బ్యానర్ స్థాయిలో ఈ వార్తలు రావడంతో చాలామంది నిజమని నమ్మారు. ఉదయం నుంచి ఇదే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. కవిత మరో షర్మిల అవుతారని, కొంతకాలం పార్టీ నడిపి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. సింగరేణి ఏరియాలపై పట్టు కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని, ఏకంగా 11 ఏరియాల్లో జాగృతి కన్వీనర్లను నియమించారని ఆ పత్రిక కథనాల్లో పేర్కొంది. గతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కవిత కొనసాగారని, నాటి ప్రాభవం కోసం తాపత్రయపడుతున్నారని కూడా రాసింది.

నిజానికి, కొద్ది రోజులుగా భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గులాబీ నేతలు మౌనంగా ఉన్నారు. కల్వకుంట్ల కవిత రాసిన లేఖలను మొదట్లో కొంతమంది గులాబీ నేతలు డ్రామా అని కొట్టిపారేశారు. ఆ తర్వాత ఆ లేఖలు రాసింది తనే అని చెప్పడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఇక, కాంగ్రెస్‌తో రాయబారం కథనంలో రేవంత్ రెడ్డి పేరు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరును ఆ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. కవిత పార్టీలో చేరే విషయాన్ని కొంతమంది దూతల ద్వారా కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారని, ఈ విషయాన్ని వారు రేవంత్, మహేష్ కుమార్ వద్ద ప్రస్తావిస్తే వారు నో చెప్పారని ఈ కథనాన్ని వండివార్చింది. బుధవారం ఉదయం నుంచి ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగానే ఈ వ్యవహారంపై గులాబీ నేతలు గప్ చుప్' అన్నట్టుగా వ్యవహరించారు.

చివరికి ఈ విషయం రాజకీయంగా దుమారం రేపడంతో కవిత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించాల్సి వచ్చింది. "కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా? శాడిజమా?" అంటూ కవిత తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తన కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని, కొత్త పార్టీ పెట్టేది లేదని విషయంలో మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పత్రిక గనక సంప్రదిస్తే క్లారిటీ ఇచ్చేదాన్ని అని పేర్కొంది. తప్పుడు కథనం అంటూ కొట్టిపారేసింది.