హరీశ్, సంతోష్ తోనే కేసీఆర్ కు చెడ్డపేరు..కవిత సంచలన వ్యాఖ్యలు
తన తండ్రి కేసీఆర్ పక్కనున్న కొందరు ఆయన పేరు చెప్పుకొని అనేక చెడ్డపనులు చేశారని అన్నారు.
By: Tupaki Desk | 1 Sept 2025 5:40 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... అమెరికా నుంచి తిరిగి వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం విమానాశ్రయంలో దిగిన కవిత... సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టారు. తన తండ్రి కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ లోని కొందరు అవినీతికి పాల్పడ్డారని, ఆయనకు చెడ్డపేరు తెచ్చారని మండిపడ్డారు. చిన్న కుమారుడి పైచదువుల కోసం గత నెలలో అమెరికా వెళ్లిన కవిత తిరిగొచ్చిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలకు దిగడం గమనార్హం. హైదరాబాద్ లో సోమవారం ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
వారితోకే కేసీఆర్ కు అవినీతి మరక
తన తండ్రి కేసీఆర్ పక్కనున్న కొందరు ఆయన పేరు చెప్పుకొని అనేక చెడ్డపనులు చేశారని అన్నారు. అనేక రకాలుగా లబ్ధి పొందారని, అనేక చెత్త పనులు చేశారని వారి కారణంగానే నేడు బద్నాం అయ్యే పరిస్థితి వచ్చిందని కవిత ఆరోపించారు. వీరందరి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు. ఇది ఎందుకోసం వస్తుందో ఆలోచన చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇందులో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర లేదా? అని ప్రశ్నించారు. హరీశ్ ఐదేళ్ల పాటు సాగునీటి మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ సంతోష్ పేరు చెప్పకుండానే మాజీ ఎంపీ అని ప్రస్తావిస్తూ, వీరితో పాటు మేఘా ఇంజినీరింగ్ క్రిష్ణారెడ్డి పేరునూ బయటకు తెచ్చారు. కాళేశ్వరంలో కుంగింది చిన్న భాగమేనని, మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు..
కేసీఆర్ ప్రజల కోసం పనిచేశారని... కానీ, ఆయన పక్కనున్న వారు ఆస్తులు పెంచుకోవడానికి పనిచేశారని కవిత ఆరోపించారు. హరీశ్ కు కేసీఆర్ రెండోసారి సాగునీటి మంత్రి పదవి ఇవ్వనిది అందుకేనని అన్నారు. హరీశ్, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారని.. అన్నింటినీ తాను భరించానని వివరించారు. తన లేఖ బయటకు వచ్చినప్పుడూ తాను మాట్లాడలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ పేరు బద్నాం అవుతుండడంతతో తాను ఆయన బిడ్డగా తాను బాధపడుతున్నట్లు తెలిపారు.
హరీశ్, సంతోష్ వెనుక రేవంత్...!
హరీశ్ రావు, సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని కవిత ఆరోపించారు. అందుకే వారిద్దరినీ రేవంత్ ఏమీ అనడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ నే టార్గెట్ చేస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక ఇక బీఆర్ఎస్ ఉంటే ఎంత? లేకపోతే ఏంటి? అని ప్రశ్నించారు. ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయం అని అన్నారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని, తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని రేవంత్ రెడ్డి ఆయన మీదనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారంటే దానికి కారణం మీరు కాదా? అని హరీశ్, సంతోష్ లను కవిత నిలదీశారు. ఈ వయసులో కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా వారినే మోస్తాం.. వారినే ముందుకు తీసుకెళ్తాం అంటే పార్టీ ఎట్లా మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
