‘కాళేశ్వరం’ బాధ్యుల ఉద్యోగాలకు ముప్పు? క్రిమినల్ చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం
తెలంగాణలోని ‘కాళేశ్వరం’ ప్రాజెక్టులో నాణ్యత లోపాలు, డిజైన్ మార్పులకు సంబంధించి బాధ్యులైన 38 మంది ఉద్యోగులు, అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది
By: Tupaki Desk | 19 Jun 2025 1:00 AM ISTతెలంగాణలోని ‘కాళేశ్వరం’ ప్రాజెక్టులో నాణ్యత లోపాలు, డిజైన్ మార్పులకు సంబంధించి బాధ్యులైన 38 మంది ఉద్యోగులు, అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ‘కాళేశ్వరం’పై విచారణ చేపట్టిన విజిలెన్స్ నివేదిక ప్రకారం 38 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన పలువురు ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఉద్యోగాలే ప్రమాదంలో పడినట్లు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించి 17 మందిపై నేరపూరిత కుట్ర కేసు పెట్టి విచారణ చేపట్టాలని, మరో 33 మందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, పదవీ విరమణ చేసిన ఏడుగురికి నిబంధనలు అనుసరించి పెన్షన్ లో విధిస్తూ జరిమానాలు వేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మొత్తం 57 మందిపై చర్యలకు కమిషన్ నివేదిక సమర్పించగా, ఒక్కొక్కరిపై రెండు, మూడు అభియోగాలు ఉండటంతో మొత్తం లెక్క 38కి వచ్చింది.
‘మీపై వచ్చిన అభియోగాలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వండి’ అన్న ఏకవ్యాఖ్యతో ఒకే నమూనాలో ఈ నోటీసులు వెళ్లాయి. దీంతో 38 మంది సిబ్బంది వారం రోజుల్లో ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సివుందని అంటున్నారు. నోటీసులు అందుకున్న వారు ఇచ్చే సమాధానం ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలా? లేక శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా? అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ‘‘వీరే కాకుండా ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ సమయంతోపాటుమేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయేదాకా నీటిపారుదల, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులుగా పనిచేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఉద్యోగ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోంది. మొత్తం 17 మందిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయగా, వారిలో పది మంది రిటైర్ అయ్యారు. వీరి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.
