కాళేశ్వరం కేసు.. హరీష్ రావు విచారణ పూర్తి.. కమిషన్‌కు కీలక సమాధానాలు!
దీనికి హరీష్ రావు వివరణ ఇస్తూ..సెంట్రల్ సర్వే ఆర్గనైజేషన్ వాప్‌కోస్, సాంకేతిక కమిటీ, హై పవర్ కమిటీ, క్యాబినెట్ సబ్-కమిటీ సిఫార్సుల ప్రకారమే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
By: Tupaki Desk | 9 Jun 2025 11:14 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పై న్యాయ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో జరిగిన ఈ విచారణ సుమారు 45 నిమిషాల పాటు సాగింది. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. అసలు ఈ విచారణలో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.
విచారణ ప్రారంభంలో హరీష్ రావు ముందుగా కమిషన్ ఎదుట ప్రమాణం చేశారు. తాను తెలుగు మీడియం విద్యార్థిని కాబట్టి ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడలేనని అయితే అర్థం చేసుకోగలనని కమిషన్‌కు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇంగ్లీష్‌లో ఇబ్బంది ఉంటే హిందీలో మాట్లాడవచ్చు లేదా తెలుగులో చెప్పిన వాటిని అనువదించడానికి సిబ్బంది ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించి హరీష్ రావు అధికారులు చూసుకున్నారు అని మాత్రమే సమాధానం ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అని కమిషన్ ప్రశ్నించింది. దీనికి హరీష్ రావు వివరణ ఇస్తూ..సెంట్రల్ సర్వే ఆర్గనైజేషన్ వాప్‌కోస్, సాంకేతిక కమిటీ, హై పవర్ కమిటీ, క్యాబినెట్ సబ్-కమిటీ సిఫార్సుల ప్రకారమే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రధానంగా మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడం జరిగిందని అన్నారు. ఒకవేళ ఎత్తును 152 అడుగుల నుండి 148 అడుగులకు తగ్గిస్తే నీటి లభ్యత ఉండదని కేంద్ర జల సంఘం కూడా స్పష్టం చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు.
అంతేకాదు నాగార్జునసాగర్ ప్రాజెక్టును కూడా ఏలేశ్వరం నుంచి నందికొండకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమ్మక్క బ్యారేజీని కూడా గతంలో మార్చారని హరీష్ రావు గుర్తు చేశారు. హై పవర్ కమిటీ సిఫార్సు ప్రకారమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. కాళేశ్వరం కార్పొరేషన్ కమిషన్‌ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని కమిషన్ ప్రశ్నించగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నిధుల విషయంలో ఇబ్బందులు ఉన్నందున కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని హరీష్ రావు వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును ఎలా భరించాలని అనుకున్నారు అని కమిషన్ అడిగింది. దీనికి హరీష్ రావు, సాగునీరు అందించడమే కాకుండా పరిశ్రమలకు నీరు అందించడానికి, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. కోకా-కోలా కంపెనీ నీటి అవసరాలను కూడా కాళేశ్వరం ద్వారా తీర్చాలని భావించినట్లు తెలిపారు. అయితే, కోవిడ్ కారణంగా కొన్ని కంపెనీలు ప్రాజెక్ట్ పరిధిలోకి రాలేకపోయాయని అన్నారు.
బ్యారేజీలలో నీటిని నిల్వ చేయాలని ఎవరు సూచించారు అని కమిషన్ అడిగిన ప్రశ్నకు.. అది ఒక టెక్నికల్ అంశం అని, ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయం అని హరీష్ రావు బదులిచ్చారు. కాళేశ్వరం బ్యారేజీలలో ఎంత నీటిని నిల్వ చేయవచ్చు అని కమిషన్ అడిగినప్పుడు, 140 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని హరీష్ రావు చెప్పారు. పదవీ విరమణ పొందిన ఇంజనీర్ల సూచనల ప్రకారమే మేడిగడ్డను నిర్మించారని హరీష్ రావు స్పష్టం చేశారు. మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చామని ఆయన వివరించారు. 16 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందించాలంటే రిజర్వాయర్ల సంఖ్యను పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. మేడిగడ్డ నిర్మాణం ఒక వ్యక్తి నిర్ణయం కాదని హరీష్ రావు కమిషన్‌కు తెలియజేశారు.