Begin typing your search above and press return to search.

విచారణకు మరో గడువు కోరిన కేసీఆర్.. హరీశ్ సంగతేంది?

దీనికి సంబంధించిన నివేదికలు బయటకు రావటం.. పలు లోపాల్ని హైలెట్ చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2025 12:15 PM IST
Kaleshwaram Project Probe KCR Seeks Extension
X

తన కలలకు ప్రతీకగా పేర్కొనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న విమర్శలు.. ఆరోపణల్ని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిదని పేర్కొనటం.. ఇందులో భారీ అవకతవకలు జరిగాయని.. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. కాళేశ్వరం బ్యారేజీల్లోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే.

దీనికి సంబంధించిన నివేదికలు బయటకు రావటం.. పలు లోపాల్ని హైలెట్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల ఐదున కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో కేసీఆర్ హాజరుపై ఉత్కంట నెలకొంది. ఇదిలా ఉండగా.. కమిషన్ పేర్కొన్నట్లుగా తాను ఈ నెల ఐదున విచారణకు హాజరు కాలేనని.. మరో తేదీన కమిషన్ ముందు హాజరవుతానని పేర్కొంటూ కేసీఆర్ గడువు కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన కమిషన్ ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సూచన చేసింది.

మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీలపై న్యాయవిచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మే 19న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఈటల రాజేందర్ కు.. హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కమిషన్ ఎదుట కేసీఆర్ మొదట హాజరు కావాల్సి ఉంది. తాజాగా ఆయన గడువు కోరటంతో.. షెడ్యూల్ ప్రకారం కమిషన్ ఎదుట హాజరు కావాల్సిన ఈటల.. హరీశ్ లు హాజరవుతారా? లేదంటే వారు కూడా గడువు కోరతారా? అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ - హరీశ్ లు భేటీ కావటం.. కమిషన్ అడిగే అంశాలకు ఏమేం సమాధానాలు ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కమిషన్ ఎదుట తొలుత ఎవరు హాజరవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కమిషన్ ఎదుట కేసీఆర్ చివరన హాజరు కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కమిషన్ ఏమేం ప్రశ్నలు అడుగుతోంది? దానికి తన కంటే ముందు హాజరయ్యే ఈటల.. హరీశ్ లు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా ప్రిపేర్ కావాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ.. చివర్లో ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయటం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎపిసోడ్ లో కేసీఆర్ కు రానున్న రోజుల్లో మరిన్ని తలనొప్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.