Begin typing your search above and press return to search.

దోచేసి.. అప్పగించి.. "మమ్మల్ని క్షమించండి.." అంటూ దొంగల క్షమాపణ లేఖ.. వైరల్

ఈ ఘటన స్థానికంగానే కాక నెట్టింట వైరల్‌గా మారింది. దొంగల మనసు నిజంగానే మారి పశ్చాత్తాపపడ్డారా? లేక పోలీసుల దర్యాప్తు తీవ్రతకు భయపడి ఇలా చేశారా?

By:  A.N.Kumar   |   3 Aug 2026 1:21 PM IST
దోచేసి.. అప్పగించి.. మమ్మల్ని క్షమించండి..  అంటూ దొంగల క్షమాపణ లేఖ.. వైరల్
X

సాధారణంగా దొంగలు ఒకసారి ఇంట్లో పడి సొమ్ము దోచుకెళ్తే పోలీసులు పట్టుకునే వరకు ఆ ఆస్తి దక్కడం అసాధ్యం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఒక అత్యంత విచిత్రమైన, వింతైన సంఘటన వెలుగు చూసింది. చోరీ చేసిన దొంగలే తిరిగి వచ్చి దోచుకున్న బంగారాన్ని బాధితుల ఇంట్లో పడేసి, పశ్చాత్తాపంతో క్షమాపణ లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగింది?

కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి ఇంట్లో గత నెల 18వ తేదీన చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు లూటీకి పాల్పడ్డారు. సుమారు రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే రూ. 50 వేల నగదును అపహరించుకుపోయారు. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆదివారం ఉదయం గణేశ్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో ఒక మూట వచ్చి పడటాన్ని గమనించిన బాధితులు దాన్ని విప్పి చూసి అవాక్కయ్యారు.

"మమ్మల్ని క్షమించండి.." దొంగల క్షమాపణ లేఖ

ఆ మూటలో దొంగిలించిన బంగారు నగలతో పాటు రూ. 28,000 నగదు ఉన్నాయి. అంతటితో ఆగకుండా అందులో దొంగలు ఒక ఉత్తరం కూడా ఉంచారు. "మా వల్ల పెద్ద తప్పు జరిగింది.. మమ్మల్ని దయచేసి క్షమించండి. మేము తీసుకెళ్లిన మొత్తం నగదులో రూ. 22,000 ఖర్చు చేశాం. ఆ డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేకపోతున్నాం. మిగతా బంగారం, నగదును తిరిగి ఇచ్చేస్తున్నాం" అని పేర్కొన్నారు. ఈ వింత పరిణామానికి బాధిత కుటుంబం తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. పోయాయనుకున్న కోట్లాది విలువైన జ్ఞాపకాలు.. నగలు తిరిగి దక్కడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల విచారణ.. సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటన స్థానికంగానే కాక నెట్టింట వైరల్‌గా మారింది. దొంగల మనసు నిజంగానే మారి పశ్చాత్తాపపడ్డారా? లేక పోలీసుల దర్యాప్తు తీవ్రతకు భయపడి ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, లేఖపై ఉన్న వేలిముద్రలను సేకరిస్తున్నారు. దొంగలు రాసిన లేఖ తిరిగి ఇచ్చిన నగల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. "దొంగలందు ఈ దొంగలు వేరయా", "నీతి నిజాయితీ ఉన్న దొంగలు" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనా దోచుకెళ్లిన సొమ్మును తిరిగి ఇంటికే తెచ్చిచ్చిన ఈ "పశ్చాత్తాప దొంగల" ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.