Begin typing your search above and press return to search.

రంగరాయ మెడికల్ కాలేజీలో కీచకపర్వం.. సీఎం సీరియస్, నలుగురి సస్పెన్షన్!

కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో బీఎస్సీ, డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విద్యార్థినుల పట్ల కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం వెలుగు చూసింది

By:  Tupaki Desk   |   11 July 2025 2:08 PM IST
రంగరాయ మెడికల్ కాలేజీలో కీచకపర్వం.. సీఎం సీరియస్, నలుగురి సస్పెన్షన్!
X

కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో బీఎస్సీ, డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విద్యార్థినుల పట్ల కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం వెలుగు చూసింది. ముఖ్యంగా ల్యాబ్ సహాయకుడు ఒకరు, మరో ఉద్యోగి వికృత చేష్టలపై కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు అందింది. ఈ నెల 8న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద విలపించడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది అసభ్యంగా వ్యవహరిస్తున్నారని సుమారు 50 మంది విద్యార్థులు కమిటీకి నివేదించారు.

ప్రధానంగా ఇద్దరు సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తాము శాశ్వత ఉద్యోగులమని, తమనెవరూ ఏం చేయలేరని నిందితులు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. కొందరు ల్యాబ్ అసిస్టెంట్లు మద్యం తాగి వస్తున్నారని కూడా కమిటీకి చెప్పారు. తాను ఎవరి పట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది చెప్పినట్లు సమాచారం. విద్యార్థుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్థన్ మీడియాకు తెలిపారు.

కాగా, విషయం వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులైన ల్యాబ్ టెక్నీషియన్లు జమ్మీ రాజు, గోపాల కృష్ణ, ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం ఆదేశాలతో నిందితులు నలుగురిని వెనువెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు.