బిగ్ బ్రేకింగ్.. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లోనే 18 మంది మృతి
కాకినాడ జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాణ సంచా తయారీ కేంద్రంలో ప్రమాదశాత్తూ పేలుడు సంభవించడంతో 18 కార్మికులు స్పాట్ లోనే మరణించారు.
By: Tupaki Political Desk | 28 Feb 2026 4:07 PM ISTకాకినాడ జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాణ సంచా తయారీ కేంద్రంలో ప్రమాదశాత్తూ పేలుడు సంభవించడంతో 18 కార్మికులు స్పాట్ లోనే మరణించారు. ప్రమాద సమయంలో మొత్తం 20 మంది వరకు ఉండగా, ఐదుగురు సజీవ దహనమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 20 మందిలో 18 మంది మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
పేలుడు ధాటికి మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి. మృతదేహాలు ఎగిరిపడటమే కాకుండా మాంసం ముద్దలుగా మారాయి. దీంతో మృతదేహాలను గుర్తించడమే కష్టంగా మారింది. ప్రమాద స్థలిని చూస్తే ఏ ఒక్కరూ తప్పించుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే బాణసంచా దుకాణంలో మొత్తం ఎంతమంది ఉన్నారనే సంఖ్యపై క్లారిటీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఉందని అంటున్నారు. పెద్ద మొత్తంలో బాణ సంచా నిల్వ చేయడంతోనే ఇంత ఘోరం జరిగి వుంటుందని అనుమానిస్తున్నారు.
సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు గ్రామాలకు మధ్య పొలాల మధ్య ఈ బాణ సంచా తయారీ కేంద్రం ఉంది. అనధికారికంగా నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. చాలా మంది ఆచూకీ తెలియలేదు. కార్మికులు మొత్తం ప్రమాదంలో గాయపడినట్లు చెబుతున్నారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
వేట్లపాలెం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రం చాలా కాలంగా నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి అనుమతి లేదన్న సమాచారం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం కార్మికులు భోజనం చేసిన తర్వాత మళ్లీ పనుల్లో చేరిన సమయంలో పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, జాతరలు కూడా నిర్వహిస్తుండటం వల్ల మందుగుండు సామగ్రికి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. దీంతో సామర్లకోట మండలంలోనే కాకుండా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అనధికార దుకాణాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్థులు హుటాహుటిన చేరుకున్నారు. అధికారులు, పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. గ్రామంలో వరి పొలాల మధ్య బాణ సంచా దుకాణం నిర్వహిస్తున్నారు. పేలుడు ధాటికి కార్మికుల ఎగిరి పక్కనున్న పొలాల్లో బురదలో కూరుకుపోయారు.
