కోర్టుల్లో కాకాణి కేసు ఫైళ్ల మిస్సింగ్.. తెరపైకి సరికొత్త విషయాలు
నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై నమోదైన కేసుల ఫైళ్లు కోర్టుల్లోనే మాయం అవడం చర్చనీయాంశం అవుతోంది.
By: Tupaki Desk | 8 Dec 2025 5:00 AM ISTనెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై నమోదైన కేసుల ఫైళ్లు కోర్టుల్లోనే మాయం అవడం చర్చనీయాంశం అవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన న్యాయస్థానాల్లో.. కాకాణికి సంబంధించిన కేసులకు సంబంధించిన కాగితాలే ఎలా మాయమవుతున్నాయన్నది ఓ మిస్టరీగా మారింది. గతంలో కాకాణిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన ఫైళ్లు కోర్టులో దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించగా, తాజాగా అలాంటిదే మరో ఉదంతం బయటకు వచ్చింది. దీంతో కాకాణిపై కేసులు, కోర్టుల్లో గల్లంతవుతున్న ఫైళ్లుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని గతంలో కాకాణి ఆరోపించారు. కొన్ని పత్రాలు విడుదల చేశారు. అయితే అవన్నీ ఫోర్జరీ పేపర్లు అంటూ ఆరోపిస్తూ సోమిరెడ్డి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కోర్టులో దొంగలు పడి కాకాణికి చెందిన పత్రాలు దొంగిలించారు. కోర్టులో ఎన్నో పత్రాలు ఉండగా, కాకాణి కేసుకు సంబంధించిన కాగితాలే మాయం అవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సీబీఐ విచారణ కూడా జరిగింది. ఈ కేసు ఇలా నడుస్తుండగానే .. తాజాగా అలాంటిదే మరో కేసు వెలుగు చేసింది. 2014లో ఎన్నికల సమయంలో కాకాణిపై నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఫైళ్లలో కీలక డాక్యుమెంట్లు అదృశ్యమైనట్లు బయటపడింది.
2018 చివర్లోనే విజయవాడ ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిని అప్పట్లో సీఐడీకి అప్పగించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు మూలన పడింది. ఆ ఐదేళ్లు పట్టించుకోకపోవడంతో కల్తీ మద్యం కేసు మరుగపడిందని అనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంటుగా ఈ కేసును తిరగతోడటంతో మళ్లీ కదలిక వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు సీఐడీ అధికారులు మద్యం కేసుపై మిస్సయిన ఫైళ్లను సేకరించే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
కాకాణితోపాటు వైసీపీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఫైళ్లు కోర్టులో మిస్సయినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి అనుచరులు పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. గోవా నుంచి కల్తీ మద్యం తెచ్చి వాటికి స్థానిక లేబుళ్లు అంటించి పంపిణీ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సర్వేపల్లితోపాటు కావాలిలోనూ ఇదే మద్యం పంపిణీ చేయడంతో పలువురు అనారోగ్యం పాలయ్యారు.
దీంతో కాకాణితోపాటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపైనా కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించగా, 2017లో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో 2018లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు విజయవాడ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో కాకాణి, రామిరెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించిన ఫైళ్లు మిస్ అయ్యాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్పించుకోవడంతో మళ్లీ కదలిక వచ్చిందని అంటున్నారు.
