ఎక్కడున్నావు కాకాణి.. జల్లెడ పడుతున్న పోలీసులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాణి నాలుగుసార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యయి.
By: Tupaki Desk | 10 April 2025 5:10 AMవైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసు వేట మొదలైంది. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వార్జ్ మైనింగ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో కాకాణి అరెస్టుకు మార్గం సుగమమైందని అంటున్నారు. అక్రమ మైనింగుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణకు రమ్మంటూ కాకాణికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా కాకాణికి ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు ఏం జరుగుతుందోనని వైసీపీ టెన్షన్ పడుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాణి నాలుగుసార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యయి. ప్రధానంగా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగు ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 16న కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదు చేయడాన్ని తొలుత తేలిగ్గా తీసుకున్న కాకాణి, దమ్ముంటే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు సవాల్ విసిరారు. అయితే కాకాణిని పక్కాగా బుక్ చేసేందుకు ప్రణాళిక రచించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించి విచారణకు పిలిచారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని తెలుసుకున్న కాకాణి అరెస్టు భయంతో అండర్ గ్రౌండుకు వెళ్లిపోయారు.
మరో వైపు కాకాణి కోసం పోలీసులు నెల్లూరు, హైదరాబాదులో వెతకడం ప్రారంభించారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నాళ్లు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆశించాయి. అయితే కోర్టు నుంచి ప్రతికూల తీర్పు వెలువడటంతో కాకాణికి చిక్కులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగులో ఉందనే కారణంగా కాకాణిపై చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించలేమని స్పష్టం చేయడంతో మాజీ మంత్రి అరెస్టుకు లైన్ క్లియర్ చేసినట్లైందని అంటున్నారు. ఎఫ్ఐఆర్, ఇతర రికార్డులను పరిశీలిస్తే కాకాణి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన, సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడంతో కాకాణి అన్నివిధాలా చిక్కుకున్నట్లే అంటున్నారు.
ఇక కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాకాణి కోసం గాలింపు మొదలుపెట్టారు. నెల్లూరు వైసీపీలో కాకాణి కీలక నేతగా చెలామణి అవుతున్నారు. మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై చర్యలకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాకాణిపై చర్యలకు పోలీసులు పకడ్బందీగా వ్యూహరచన చేశారంటున్నారు.