కాకాణిని ముప్పతిప్పలు పెడుతున్న 3 కేసులు.. తాజా స్టేటస్ ఇదే!
మూడు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒక కేసులో కాస్తంత ఊరట చెందినప్పటికీ.. మరో రెండు కేసుల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి.
By: Tupaki Desk | 28 Jun 2025 4:47 AMమూడు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒక కేసులో కాస్తంత ఊరట చెందినప్పటికీ.. మరో రెండు కేసుల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక దాని తర్వాత ఒక కేసు చొప్పున మూడు కేసులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఆప్డేట్స్ తో ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంత్రిగా ఉన్న వేళలో.. ఆయన హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విషయంలో ఆయన తీరు వేరుగా ఉంటుందని చెబుతారు.
అలాంటి ఆయనపై కనుపూరు చెరువులో మట్టిని తవ్వటం.. లేఅవుట్లను అమ్మటం.. గ్రావెల్ అక్్రమ తవ్వకాలపై కేసు.. క్రిష్ణపట్నం పోర్టుకు సమీపంలో అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడటం.. ప్రభుత్వ వ్యవస్థలకు సమాంతరంగా తనదైన వ్యవస్థతో దందా చేసినట్లుగా ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మూడు కేసుల్లో ఒక దానికి బెయిల్ రాగా.. మిగిలిన రెండు కేసులలో ఒకటి కస్టడీకి.. మరో కేసులో రిమాండ్ కు పంపాలన్న నిర్ణయం ఆయనకు షాకులుగా మారాయి.
కనుపూరు చెరువులో మట్టి తవ్వి..అక్రమ లేఅవుట్లను అమ్మారన్న ఆరోపణలతో నమోదైన కేసు విషయానికి వస్తే ఆయనకు నెల్లూరు కోర్టు జులై 11 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2023లో కనుపూరు చెరువులో మెరక పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకొని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తరలించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సర్వేపల్లి రిజర్వాయరు గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో కాకాణికి తాజాగా బెయిల్ లభించింది. ఇక.. 2022లో క్రిష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో ఆయన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి జులై 1వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరపాలని.. అనంతరం కోర్టుకు హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆయనపై నమోదైన మూడు కేసులతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.