పిల్ల ఎన్నికలు.. పెద్ద రాజకీయాలు.. అట్టుంది ఏపీలో!
ఎన్నికలు అంటే.. దానికో లెక్క.. పద్ధతి ఉంటాయి. గ్రామ, వార్డు, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలకు తేడా ఉంది కదా! అయితే.. ఆ తేడా ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు.
By: Garuda Media | 30 July 2025 10:00 PM ISTఎన్నికలు అంటే.. దానికో లెక్క.. పద్ధతి ఉంటాయి. గ్రామ, వార్డు, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలకు తేడా ఉంది కదా! అయితే.. ఆ తేడా ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. 'ఎన్నికలు' అనే మాట వినిపిస్తే చాలు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య 'సై.. అంటే సై' అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. పెద్ద ఎన్నికలైనా.. పిల్ల ఎన్నికలైనా.. పంతాలు.. పట్టింపులు.. నామినేషన్ల నుంచే ప్రారంభం అవుతున్నాయి.
ఏడాది పాలనతో కూటమి పార్టీలు ప్రజల వ్యతిరేకతను సొంతం చేసుకున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. కూటమి పార్టీలను మట్టి కరిపించాలన్నది వైసీపీ నేతల వ్యూహం. ఇక, 11 స్థానాలకు పరిమితమైన వైసీపీని.. మరింత నేలమట్టం చేయాలన్నది అధికార పార్టీ టీడీపీ ప్రతివ్యూహం. దీంతో ఏ ఎన్నిక వచ్చినా.. కాచుకుని కూర్చున్నట్టుగా ఇరు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు.
అందునా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇలాకా.. కడపలోనే ఇప్పుడు ఎన్నికలు రావడంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ నాయకులు పోటాపోటీగా ఎన్నికలను తీసుకున్నాయి. ఇంతకీ విషయం ఏంటి.. కడప జిల్లాలో రెండు జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్ట్సిట్యుయెన్సీ(జెడ్‌పీటీసీ) స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీలు పోటా పోటీగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వరకు కూడా రాజకీయాలను వేడెడక్కించనున్నాయి.
ఎందుకు.. ఏంటి.. ఎలా..?
కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో వీటిలో 49 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఒకే ఒక్క చోట టీడీపీ విజయం సాధించింది. అయితే.. వైసీపీ సభ్యులుగా ఉన్న వారిలో జగన్ సొంత నియోజకవర్గం .. పులివెందుల జడ్పీటీసీ కొన్నాళ్ల కిందట మృతి చెందారు. ఇక, ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు.
దీంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఇక, ఈ జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో అన్ని వైపుల నుంచి రాజకీయ కాక పెరిగింది. తమ పట్టు పెంచుకునేందుకు టీడీపీ.. తన సత్తా చాటుకు నేందుకు వైసీపీ.. పిల్ల ఎన్నికలే అయినా.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నా యి. కాగా.. ఆగస్టు 12న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. 14న రిజల్ట్ రానుంది.
