Begin typing your search above and press return to search.

క‌డ‌ప‌లో కూట‌మి స‌త్తా.. ఓ రేంజ్‌లో నేతల దూకుడు ..!

వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో కూటమి పార్టీలు సత్తా చాటుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   9 July 2025 9:30 AM IST
క‌డ‌ప‌లో కూట‌మి స‌త్తా.. ఓ రేంజ్‌లో నేతల దూకుడు ..!
X

వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో కూటమి పార్టీలు సత్తా చాటుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గతానికి భిన్నంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు వేరువేరుగా రాజకీయాలు చేసినా.. వైసీపీకి వ్యతిరేక రాజకీయాలు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో కడపలో టిడిపి కొన్ని స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో బిజెపి కూడా సత్తా చాటుకుంది.

ఆ తర్వాత కొన్నాళ్లు స్త‌బ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో వైసిపి తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ప్రజల్లోనూ ఒకంత వైసీపీ పై సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇది కడపకే పరిమితమైనప్పటికీ ఈ జిల్లాను సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మహానాడులో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 10 దక్కించుకోవాలని ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలతో పాటు టిడిపి నాయకులు కూడా కడపలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సహా ఎమ్మెల్యే మాధవి భర్త పార్టీ కీలక నాయకుడు, మహానాడు ను ఘనంగా నిర్వహించార‌న్న పేరు తెచ్చుకున్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టడం, క్షేత్రస్థాయిలో టిడిపిని బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యేలను కలుపుకొని పోతున్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువవుతున్నారు. ఇక కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వైసీపీ నాయకులపై నిప్పులు జరుగుతున్నారు. కడప కార్పొరేషన్ లో టిడిపి హవా సాగించేలాగా మాధవి చక్రం తిప్పుతున్న విషయం కూడా తెలిసిందే. వీరికి తోడు బిజెపి ఎమ్మెల్యే జమ్మలమడుగు నాయకుడు ఆదినారాయణ రెడ్డి కూడా ఆ పార్టీ తరపున రాజకీయాలు తీవ్రతరం చేశారు.

వైసిపి అన్న మాటే వినిపించకుండా ఆయన ఇటు కూటమి పాలన పైన, అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పైన ప్రచారం చేస్తూ రాజకీయాల్లో దూసుకుపోతున్నారని చెప్పాలి. మొత్తంగా చూస్తే కడపలో ఒకప్పుడు ఉన్న స్తబ్దత ఇప్పుడైతే కనిపించట్లేదు. టిడిపి ఒక రకంగా పుంజుకుందనే చెప్పాలి.