Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ సొంత గడ్డపై కూటమి దెబ్బ.. కడప మేయర్ అనూహ్య తొలగింపు

ఎండలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత హాట్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2025 5:01 PM IST
వైఎస్ జగన్ సొంత గడ్డపై కూటమి దెబ్బ.. కడప మేయర్ అనూహ్య తొలగింపు
X

ఎండలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత హాట్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. సరిగ్గా గత ఏడాది మే 13న పోలింగ్ జరిగి జూన్ 4న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్ల పాటు అప్రతిహతంగా సాగిన వైసీపీ పాలనకు తెరపడింది. మరొక్క 20 రోజుల్లో ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ ప్రస్తుతం కారాలు మిరియాలు నూరుతోంది.

దాదాపు ఏడాది కాలంలో పలువురు ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమవైపు లాక్కున్న కూటమి సర్కారు ఇప్పుడు మరింతగా స్థానిక సంస్థలపై గురిపెడుతోందా? అనే ప్రశ్న వస్తోంది.

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను సొంతగడ్డ పైనే దెబ్బకొట్టే వ్యూహాలకు పదును పెడుతోందా..? అనే సందేహం కలుగుతోంది.

కడప అంటే వైఎస్ ఫ్యామిలీ.. వైఎస్ ఫ్యామిలీ అంటే కడప. ఈ పార్లమెంటు నియోజకవర్గం 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది. ఇందులోని పులివెందుల నియోజకవర్గం 1978 నుంచి వైఎస్ కుటుంబానిదే.

ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన సురేశ్ బాబు మేయర్ గా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సురేశ్‌బాబును పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అవినీతి ఆరోపణలను కారణంగా చూపుతూ సురేశ్ బాబుపై అనర్హత వేటు వేసింది. దీనికి విజిలెన్స్ విచారణను ఆధారంగా చేసుకుంది. ఈ విచారణ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా చూపింది.

కడపలో డెవలప్ మెంట్ వర్క్స్ ను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికే చెందిన కాంట్రాక్టు సంస్థకు సురేశ్ బాబు కట్టబెట్టారని కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సురేశ్ బాబుకు ఎంఎస్ వర్థిని అనే కాంట్రాక్టు సంస్థ ఉంది. దీనిద్వారానే ఆయన డెవలప్ మెంట్ పనులు చేయించారనేది ఆరోపణ. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా మేయర్ భార్య జయశ్రీ, కుమారుడు అమరేశ్ ఉన్నారని.. మేయర్ పదవిలో ఉంటూ మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఈ చర్య కోసం కార్పొరేషన్ కమిషనర్ నుంచి రాతపూర్వక సమాచారం తీసుకున్నారు.

తనమీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి మేయర్ మంగళవారమే మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కమిషనర్ స్టేట్ మెంట్, కార్యదర్శి నివేదిక అనంతరం ప్రభుత్వం మేయర్ సురేశ్ బాబును పదవి నుంచి తొలగించింది.

అయితే, సురేశ్ బాబు సంస్థ చేపట్టిన పనుల్లో మొత్తం అవినీతి రూ.36 లక్షలు అని నిర్ధారించడం గమనార్హం.

వాస్తవానికి ఈ అంశం రెండు నెలలకు పైగా నలుగుతోంది. మేయర్ కు చెందిన సంస్థపై టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి గతంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా సొంత సంస్థకు పనులు అప్పగించారంటూ.. మార్చి 28నే మేయర్ కు షోకాజ్ పంపారు. దీంతో మేయర్ హైకోర్టుకు వెళ్లారు. రెండుసార్లు గడుపు పొడిగించినా.. చివరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది.

ఇవన్నీ పూర్తయిన నేపథ్యంలో తాజాగా మేయర్ పై ప్రభుత్వం వేటు వేసింది. ఇప్పటివరకు వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవిశ్వాసం రూపంలో తప్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అవినీతి ఆరోపణల అస్త్రం ప్రయోగించింది.