మహానాడు ప్రాంగణంలో అపశ్రుతి
టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి గురువారం వరకు కడప సమీపంలో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 May 2025 4:22 PM ISTకడప మహానాడు ప్రాంగణంలో పెను ప్రమాదం తప్పింది. అధికారిక విధుల్లో భాగంగా మహానాడు వేదిక వద్ద పనిచేస్తున్న ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు నేలకొరగడంతో వీఆర్వోలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు.
టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి గురువారం వరకు కడప సమీపంలో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు టీడీపీకి చెందిన పలువురు మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. అయితే వీరి కోసం భద్రతా ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం కూడా తలమునకలైంది. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆదివారం సాయంత్రం మహానాడు ప్రాంగణం వద్ద గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మహానాడు నిమిత్తం చేసిన ఏర్పాట్లు చెల్లాచెదురయ్యాయి. సోమవారం నుంచి వాటిని యథాతథ పరిస్థితి తెచ్చేందుకు అధికారులు, టీడీపీ నేతలు, కూలీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతోనే కటౌట్ల కోసం తవ్వకాలు జరపగా, నేల చిత్తడిగా ఉండటంతో కూలిపోతున్నాయి. హఠాత్తుగా రెండు కటౌట్లు కూలిపోవడంతో వాటి కింద చిక్కుకుని ఇద్దరు వీఆర్వోలకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.
