టీడీపీ నేత మాధవి మారాలి.. లేకపోతే కష్టమేనా ..!
కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పరిస్థితి నానాటికి ఇబ్బందిగా మారుతోంది అన్నది టిడిపిలో జరుగుతున్న చర్చ.
By: Garuda Media | 18 Oct 2025 4:00 PM ISTకడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పరిస్థితి నానాటికి ఇబ్బందిగా మారుతోంది అన్నది టిడిపిలో జరుగుతున్న చర్చ. సాధారణంగా నియోజకవర్గంలో ఆమె ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో తొలిసారి విజయం దక్కించుకున్న మాధవి రెడ్డి గెలిచినా తర్వాత చాలా దూకుడుగా వ్యవహరించారు. వైసిపి నేతలపై చాలా తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు వచ్చిన ఆరోపణలపై కేసులు కూడా నమోదు చేయించి, కొందరిని జైలుకు కూడా పంపారు. సరే రాజకీయాల్లో ఇదంతా కామన్ గా జరిగే ప్రక్రియ.
అయితే సొంత పార్టీ నాయకులను దూరం పెట్టడం కొన్ని కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అన్నది ఏ నాయకులకు కూడా సరైన విధానం అనిపించుకోదు. ముఖ్యంగా వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కడప వంటి నియోజకవర్గంలో మరోసారి విజయం దక్కించుకోవాలంటే మళ్ళీ మళ్ళీ అన్ని వర్గాలను చెరువ చేసుకోవాలి. ప్రతి ఒక్కరినీ తనవారిగా చూడాలి. వైసీపీ నాయకుల మాట ఎలా ఉన్నప్పటికీ టిడిపిలో ఉన్న నాయకులను అయినా మాధవి తనవారిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్నాళ్లుగా ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన టిడిపి నేతలు ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వీరంతా టిడిపి వాళ్ళే కావడం, సొంత నాయకురాలి వ్యవహారం పైనే విమర్శలు చేయటం ఆసక్తిగా మారింది. అంతేకాదు ఇటీవల కడపలోని పెద్ద దర్గాలో ముస్లిం మైనారిటీ కి చెందిన టిడిపి నేతలు సుమారు 900 మంది దాకా వచ్చి మాధవి రెడ్డికి మంచి ఆలోచనలు కలిగించాలంటూ ప్రార్థనలు చేయటం మరింత చిత్రంగా ఉంది. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చకు కూడా వస్తుంది. అంతేకాదు వీరంతా కలిసి కమలాపురం నేత టిడిపి సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్లారు. తమను, తమ సమస్యలను పట్టించుకోవాలని పార్టీ అధిష్టానానికి చెప్పాలంటూ నరసింహారెడ్డికి విన్నవించటం మరో చిత్రమైన విషయం.
మరి ఏం జరుగుతుంది? కీలకమైన ముస్లిం మైనారిటీ వర్గాన్ని మాధవి దూరం చేసుకుని ఏం సాధించాలని అనుకుంటున్నారనేది ప్రశ్న. దూకుడుగా ఉండడం తప్పు కాదు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం తప్పు కాదు. ప్రజల మధ్య ఉండడం కూడా తప్పు కాదు. కానీ, వర్గాలకు వర్గాలనే దూరం చేసుకునేలాగా రాజకీయాలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నది సీనియర్లు చెబుతున్న మాట. దీనిపై ఇప్పటివరకు అటు పార్టీ అధిష్టానం కాని ఇటు మాధవి రెడ్డి గాని స్పందించలేదు.
