Begin typing your search above and press return to search.

సంచలన మలుపు తిరిగిన బాలిక హత్య కేసు.. వెంకటేశ్ పై కాల్పులు..!

ప్రేమ అనే పదానికి అర్థం తెలియని ఇలాంటి ప్రేమోన్మాదుల వల్ల ఎంతో మంది ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

By:  Tupaki Political Desk   |   11 April 2026 2:10 PM IST
సంచలన మలుపు తిరిగిన బాలిక హత్య కేసు.. వెంకటేశ్ పై కాల్పులు..!
X

అడవి మృగంలా మారి 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన ఆ కిరాతకుడికి జరిగిన శాస్తి సరైనదేననిపిస్తోంది. ప్రేమ అనే పదానికి అర్థం తెలియని ఇలాంటి ప్రేమోన్మాదుల వల్ల ఎంతో మంది ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

బాలిక హత్య కేసులో సంచలన మలుపు!

కన్నకూతురు రక్తపు మడుగులో పడి ఉంటే, ఆ తండ్రి తన చేతుల్లో మోసుకెళ్తూ కాపాడుకోవాలని పడ్డ తపన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. తనను పెళ్లి చేసుకోవడం లేదనే చిన్న కారణంతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వెంకటేశ్‌కు పోలీసులు తనదైన శైలిలో బుద్ధి చెప్పినట్లు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పించుకోవాలని చూసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గొంతుకోసి ప్రాణం తీసిన మృగం

ఖాజీపేట మండలం, అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి చొరబడిన వెంకటేశ్, మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె తిరస్కరించడంతో ఘర్షణ పడి, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు.

తండ్రి ఒడిలో చివరి మాటలు..

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసిన తండ్రి శ్రీనివాసులు, ఆమెను చేతుల్లో మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆ బాలిక తన ప్రాణాలు తీసింది వెంకటేశ్, ప్రవీణ్ అని తన తండ్రికి చెప్పింది. కానీ చెన్నూరు సమీపంలోకి రాగానే ఆమె కన్నుమూసింది. ఒక పచ్చని కుటుంబాన్ని ఈ ప్రేమోన్మాది ఛిన్నాభిన్నం చేశాడు.

తప్పించుకునే యత్నం.. పోలీసుల కాల్పులు

నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, శనివారం తెల్లవారుజామున అతడిని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వెంకటేశ్ ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేశాడు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి హెచ్చరించినా నిందితుడు ఎదురుతిరగడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడు ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

‘కఠిన శిక్ష తప్పదు’

గాయపడిన కానిస్టేబుళ్లను పరామర్శించిన కడప ఎస్పీ విశ్వనాథ్‌ ఈ ఘటనపై స్పందించారు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుడిని తరలిస్తుండగా దాడికి పాల్పడడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. ఆడబిడ్డలపై దాడులు చేసేవారిని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఏమాత్రం సహించబోమని, కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రేమ పేరుతో హింసకు పాల్పడడం, కాదన్న వారిపై కక్ష పెంచుకోవడం వంటి వికృత పోకడలు నేటి యువతలో పెరిగిపోతున్నాయి. ఖాజీపేట ఘటన ఇలాంటి ఉన్మాదులకు ఒక హెచ్చరికలా ఉండాలి. ఆ బాలిక తండ్రి కడుపుకోతకు ఏ శిక్షా సరిపోదు కానీ, చట్టం తన పని తాను వేగంగా చేయడం వల్ల బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.