రంజాన్ వేళ రక్తపాతం: కాబూల్ ఆస్పత్రిపై పాక్ దాడి.. భారత్ సీరియస్
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 17 March 2026 3:12 PM ISTయుద్ధం నిబంధనలను మరిచింది.. వైమానిక దాడులు మానవత్వాన్ని విస్మరించాయి. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మాదకద్రవ్య విముక్తి ఆస్పత్రి లక్ష్యంగా జరిగిన ఘోర వైమానిక దాడి అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చికిత్స పొందుతున్న వందలాది మంది రోగులు నిద్రలోనే విగతజీవులయ్యారు. ఈ అమానుష చర్యను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని పాకిస్తాన్ తీరు పిరికిపంద చర్య అని అభివర్ణించింది. రంజాన్ మాసంలో జరిగిన ఈ దారుణకాండపై అఫ్గాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ సైతం గళమెత్తుతూ, దీన్ని ఒక 'యుద్ధ నేరం'గా ప్రకటించారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. ఒకవైపు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుండగా నిస్సహాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగులే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 16, 2026 రాత్రి కాబూల్‌లోని ఒక ప్రధాన మాదకద్రవ్య విముక్తి ఆసుపత్రిపై జరిగిన ఈ దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనంగా మారింది.
శిథిలాల కింద 400 మంది మృతి?
అఫ్గాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడిలో దాదాపు 2,000 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసమైంది. తాలిబాన్ మీడియా నివేదికల ప్రకారం ఈ ఘోర కలిలో 400 మందికి పైగా మరణించగా మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదకద్రవ్యాల బానిసత్వం నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్న అమాయకులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనని విశ్లేషకులు మండిపడుతున్నారు.
పిరికిపంద చర్య .. భారత్ ఘాటు స్పందన..
ఈ అమానుష ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ దాడిని “పిరికిపంద.. అమానుష చర్య” గా అభివర్ణించిన భారత్, అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారాన్ని పాకిస్తాన్ కాలరాస్తోందని విమర్శించింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో పౌర స్థావరాలపై దాడులు చేయడం ఆక్షేపణీయమని పేర్కొంది. ఉగ్రవాదాన్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే పాకిస్తాన్ ఇలాంటి సామాన్య ప్రజల నివాసాలు, ఆసుపత్రులపై దాడులకు తెగబడుతోందని భారత్ ఆరోపించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలబెట్టాలని డిమాండ్ చేసింది.
రషీద్ ఖాన్ భావోద్వేగ ఆవేదన
అఫ్గాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. "పౌర గృహాలు, విద్యాసంస్థలు వైద్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరం. రంజాన్ మాసంలో ప్రాణాలకు విలువివ్వకుండా ప్రవర్తించడం అసహ్యకరం. ఇది కేవలం ద్వేషాన్ని మాత్రమే పెంచుతుంది," అని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ అకృత్యంపై విచారణ జరిపించాలని కోరుతూ తమ దేశం మళ్ళీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాక్ సమర్థన.. సరిహద్దు ఉద్రిక్తతలు
మొదట ఈ దాడితో తమకు సంబంధం లేదని బుకాయించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మాట మార్చింది. తాము కేవలం తాలిబాన్ ఆయుధ గిడ్డంగులు, సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పౌరులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే భారీ ప్రాణనష్టం పాక్ వాదనలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. డ్యూరాండ్ లైన్ వద్ద గత కొన్ని వారాలుగా పాక్-అఫ్గాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి దారితీస్తోంది.
దక్షిణ ఆసియాలో శాంతి నెలకొనాలంటే ఇలాంటి కవ్వింపు చర్యలు ఆగాలని అఫ్గాన్ భౌగోళిక సమగ్రతను గౌరవించాలని భారత్ సహా పలు దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
