Begin typing your search above and press return to search.

విడుదలకు నోచుకోని కళా తపస్వి విశ్వనాధ్ కళాఖండం

ఆయన కళా తపస్వి, మహా యశ్వసి. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలూ చాటిన మహా దర్శకుడు. ఆయనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

By:  Satya P   |   2 Feb 2026 11:10 AM IST
విడుదలకు నోచుకోని కళా తపస్వి విశ్వనాధ్ కళాఖండం
X

ఆయన కళా తపస్వి, మహా యశ్వసి. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలూ చాటిన మహా దర్శకుడు. ఆయనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పద్మశ్రీ బిరుదాంకితుడు అయిన కె విశ్వనాధ్. విశ్వనాధ్ అనగానే ఎన్నో కళా ఖండాలు అలా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, స్వాతి కిరణం, స్వయంకృషి, శుభలేఖ, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి ఇలా ఎన్నో సినిమాలు ఆయన దార్శనికతకు అద్దం పడతాయి. ఆయన దాదాపుగా యాభై దాకా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎనభై శాతం పైగా విజయవంతమైనవిగానే ఉన్నాయి. ఆయన తొలి హీరో అక్కినేని నాగేశ్వరరావు అయితే ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం. అలాగే 1970 దశకంలో విశ్వనాథ్ శోభన్ బాబుల కాంబినేషన్ లో వచిన సినిమాలు అన్నీ దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి.

పంధా మార్చిన చిత్రం :

విశ్వనాధ్ 1979లో దర్శకత్వం వహించిన శంకరాభరణం మూవీ ఆయనలోని కళా సృష్టిని లోకానికి తెలియచేసింది. అక్కడ నుంచి ఆయన దర్శకత్వం పంధా మారిపోయింది. అదే వరుసలో ఆయన శాస్త్రీయ సంగీతానికి నృత్యానికి తన సినిమాలలో పెద్ద పీట వేశారు. వాటినే కధా వస్తువుగా తీసుకుని ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన సినిమాలలో పాత్రధారులు ఎంతటి ఇమేజ్ ఉన్న వారు అయినా పాత్రలుగానే కనిపిస్తారు. అదే ఆయన దర్శకత్వ నైపుణ్యం. ఒక అంధుడు ఒక మూగ అమ్మాయిల మధ్యన అనుబంధాన్ని సృష్టించి ఒక చిత్రాన్ని తీయాలన్న ఆలోచన ఎంతో సాహసం. దానిని వెండి తెర మీద ఎప్పటికీ మాసి పోని పండు వెన్నెలలు కురిపించేలా విశ్వనాధ్ తీసిన చిత్రమే సిరి వెన్నెల. ఇది కళాభిమానులతో పాటు ఎంతో మందిని ఆకట్టుకుంది.

ప్రతిభకు పట్టం :

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు విశ్వనాధ్ ప్రతిభకు అద్దం పట్టాయి. తన సినిమాలలో పాత్రధారులు అంతా సగటు మనుషులుగానే ఉంటారు. స్వయంకృషి మూవీలో హీరో పాత్ర చెప్పులు కుట్టే వాడి పాత్ర. అప్పటికే సుప్రీం హీరో ఇమేజ్ తో టాప్ హీరోగా ఉన్న చిరంజీవిని కధానాయకుడిగా పెట్టి విశ్వనాధ్ చేసిన ఈ సాహసం ప్రేక్షకుల మన్ననలను విశేషంగా పొందింది. చిరంజీవికి నంది అవార్డుని కూడా తెచ్చి పెట్టింది. కమల్ హాసన్ తో చేసిన స్వాతి ముత్యం, సాగర సంగమం. శుభ సంకల్పం చిత్రాలు ఈ రోజుకీ తెలుగు ప్రేక్షకులను రంజింప చేస్తూనే ఉంటాయి. అలాగే శృతి లయలు సినిమా కధానాయిక సుమలత కెరీర్ లోనే ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుంది.

రిలీజ్ కాని మూవీ :

తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో విశ్వనాధ్ ఎన్నో సినిమాలు దర్శకవం వహించారు. ఎంతో పేరు గడించారు. అయితే ఆయన సినీ కెరీర్ లో కూడా ఒక విడుదల కానీ చిత్రం ఉంది. ఆ సినిమా కధను ఎంతగానో ప్రేమించి నిబద్ధతతో తీసిన సినిమా జనాల ముందు తేకుండానే అలా రీల్స్ గానే మిగిలిపోయింది అంటే అది కళాభిమానులకే బాధాకరమైన విషయంగా చూడాల్సి ఉంది. విశ్వనాధ్ సినిమాలు అంటే విడుదల అవుతాయి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటాయి. అలాంటిది ఒక కళా ఖండంగా తీసిన మూవీ ఈ రోజుకీ రిలీజ్ కాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం సిరి మువ్వల సింహనాదం అనే సినిమాను విశ్వనాధ్ దర్శకత్వం వహించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో అంతా కొత్త వారే ఉంటారు. కళా క్రిష్ణ మాణిక్య భారతిలను హీరో హీరోయిన్లుగా పెట్టి తీసిన ఈ సినిమాలో ఇక కీలక పాత్రలో హీరో చంద్రమోహన్ ఉంటారు. ఈ సినిమాకు సంగీతం కేవీ మహదేవన్. పాటల ఆల్బం కూడా ఎపుడో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. కానీ మూవీ అయితే ఈ రోజుకీ రిలీజ్ కాలేదు, దాని వెనక ఉన్న కారణాలు ఎవరికీ తెలియవు కానీ విశ్వనాధ్ సృజించిన ఒక కళాఖండం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాకుండానే తెర వెనక ఉండిపోవడం ఒక విషాదమే అనుకోవాలి.