వైసీపీ లిక్కర్ స్కాం: మాజీ మంత్రి నారాయణ బేల మాటలు!
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 43 మందిపై కేసులు నమోదు చేశారు. దీనిలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ4గా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలను చేర్చారు. ప్రస్తుతం వారితోపాటు.. మరో 11 మంది జైల్లో ఉన్నారు.
By: Tupaki Desk | 23 Aug 2025 7:59 PM ISTఏపీలో వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ పేరు కూడా చేరింది. ఆయనపై కూడా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని ఆయన ఇంటికి శుక్రవారం వెళ్లి.. విచారించారు. ఇంట్లో తనిఖీలు కూడా చేశారు. నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటికే గత నెలలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని పిలిచారు. కానీ, చిన్న ఆపరేషన్ జరిగిందని.. కాబట్టి రాలేక పోతున్నానని అప్పట్లో సమాచారం ఇచ్చారు నారాయణ.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కిళత్తూరు నారాయణస్వామి.. జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. జగన్ అంటే.. తనకు ప్రాణమని చెప్పే ఆయన.. జగన్ ఫొటోలతో రూపొందించిన ఉంగరాలు ధరించి తన భక్తిని చాటుకున్నారు. అయితే..ఎక్సైజ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రజలకు నాసి రకం సరుకును అంటగట్టి, భారీ ధరలకు విక్రయించారని, ఈ క్రమంలో సుమారు 3500 కోట్ల రూపాయల వరకు సొమ్ములు దారి మళ్లించి పంచుకున్నారని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 43 మందిపై కేసులు నమోదు చేశారు. దీనిలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ4గా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలను చేర్చారు. ప్రస్తుతం వారితోపాటు.. మరో 11 మంది జైల్లో ఉన్నారు. వీరిలో మాజీ ఐఏఎస్ సహా.. జగన్ మాజీ ఓఎస్‌డీ కూడా ఉన్నారు. ఇక, ఈ కేసులో మరింత కూపీ లాగేందుకు నాటి మంత్రిగా నారాయణ స్వామిని విచారించేందుకు సిట్ రెడీ అయింది. అయితే.. తనకు ఏ పాపం తెలియదని నారాయణ స్వామి చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బేల పలుకులు పలికారు.
"అయ్యా. నేను పెద్దగా చదువు కోలేదు. ఆ విషయాలేవీ నాకు తెలియదు. అంతా మా అన్నే చూసుకున్నా డు. ఇంతకు మించి నాకేమీ తెలియదు" అని సిట్ అధికారులకు తేల్చి చెప్పారు. అయితే.. ఆ `అన్న` ఎవరనేది సిట్ అధికారులకు ఆయన చెప్పలేదు. దీనిపై మరింత లోతుగా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోసారి విచారణకు రావాలంటూ.. నారాయణ స్వామికి నోటీసులు ఇచ్చారు. ఇక, అధికారులు చెబుతున్న సమాచారం మేరకు.. నెలకు రూ.50 లక్షల వరకు నారాయణ స్వామికి ముడుపులు అందాయని సమాచారం.
