జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధంపై పోలీసులు క్లారిటీ!
ఈ సందర్భంగా ఆమెను విచారిస్తోన్న హర్యానా పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలపైనా స్పష్టత ఇచ్చారు.
By: Tupaki Desk | 22 May 2025 11:11 AM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన పలు పరిణామాల్లో ఇటీవల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన ఆమెపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమెను విచారిస్తోన్న హర్యానా పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలపైనా స్పష్టత ఇచ్చారు.
అవును... పాక్ కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు ఆమెకు ఉగ్రవాదుల్తొ సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఇదే సమయంలో సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని.. అయితే, ఆమె మాట్లాడుతున్నవారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందినవారు ఉన్నారని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు!
ఇలా ఆమె మాట్లాడుతున్న వారిలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థకు చెందినవారు ఉన్నారని తెలిసినప్పటికీ.. ఆమె వారితో సంప్రదింపులు కొనసాగించారని.. అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలను తాము గుర్తించలేదని.. ఉగ్ర కార్యకలాపాల్లో ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాలు లేవని.. మన సాయుధ దళాల ప్లాన్స్ గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అన్నిపించడం లేదని ఎస్పీ తెలిపారు.
ఇదే సమయంలో... పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గానీ కన్ ఫాం చేసే ఆధారాలు తమకు ఏమీ దొరకలేదని ఎస్పీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ఆమె డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపైనా ఎస్పీ స్పందించారు. ఇందులో భాగంగా.. ఆమె డైరీలోని కొన్ని పేజీలు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అయితే, అలాంటి డైరీని తామేమీ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు.
తమ దగ్గర ఆమెకు సంబంధించిన ఎలాంటి డైరీ లేదు కానీ... ఆమెకు చెందిన ఒక ల్యాప్ టాప్, మూడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రం స్వాధీనం చేసుకున్నామని.. ప్రస్తుతం వాటిని ల్యాబ్ కు పంపించామని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయని.. ప్రస్తుతం ఆమె తమ కస్టడీలోనే ఉందని తెలిపారు!
కాగా... యూట్యూబర్ జ్యోతి 2023లో పాకిస్థాన్ కు వెళ్లారని, ఆ సమయంలో పాక్ హైమిషన్ ఉద్యోగి డానిష్ తో పరిచయమైందని.. అనంతరం, ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో.. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ డానిష్ తో జ్యోతి మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారించారు!
ఈ నేపథ్యంలోనే... ఆమెకు ఉగ్రముఠాలతో కానీ, ఉగ్రవాదులతో కానీ, ఉగ్రకార్యకలాపాలతో కానీ సంబంధం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాలూ దొరకలేదని తాజాగా ఎస్పీ తెలిపారు!
