పాక్ తో సంబంధం.. అంగీకరించిన జ్యోతి మల్హోత్రా
ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
By: Tupaki Desk | 21 May 2025 4:15 PM ISTగూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక ఆంగ్ల మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. పాక్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్నని జ్యోతి విచారణలో పేర్కొంది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్ళిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె వెల్లడించింది.
- బ్లాకౌట్ వివరాలు కూడా పాక్‌కు..
ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. దీంతోపాటు.. ఆమెకున్న రెండు బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నారు. నేటితో జ్యోతి పోలీస్ కస్టడీ ముగియనుంది. ఆమెను హిస్సార్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
-డైరీలో పాక్‌పై ప్రేమ..
తాజాగా జ్యోతి మల్హోత్రా డైరీ, ఫొటోలు వైరల్‌గా మారాయి. దానిలో ఆమె పాక్‌పై విపరీతమైన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది. ఆ దేశం క్రేజీగా, కలర్‌ఫుల్‌గా ఉన్నట్లు అభివర్ణించింది.
- గూఢచర్యంలోకి దించిన ‘హ్యాపీనెస్’
పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ వీసా విభాగంలో పని చేసేవాడు. పంజాబ్‌లోని మలేర్‌కోట్లా ప్రాంతానికి చెందిన గజాల అనే యువతిని కూడా హనీట్రాప్‌లోకి లాగి.. గూఢచర్యానికి వాడుకొన్నట్లు తెలుస్తోంది. ఆమె తన కుటుంబంలోని వారికి వీసాల కోసం ఫిబ్రవరి 2వ తేదీన పాక్ హైకమిషన్‌కు వెళ్ళింది. ఆ మర్నాడు వారి వీసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనేందుకు గజాలా ఆంటీ నస్రీన్ బానో హైకమిషన్‌కు వెళ్ళింది. నాడు గజాలా వీసా మినహా అందరివి ఓకే అయినట్లు వెల్లడించారు. అదేనెల 27వ తేదీన హైకమిషన్‌లో వీసా ఆఫీసర్ అంటూ డానిష్ నుంచి గజాలకు మెసేజ్ వచ్చింది. నాటినుంచి ఇద్దరి పరిచయం పెరిగింది. మరో ఫోన్ నెంబర్ నుంచి టెలిగ్రామ్ యాప్ వాడాలని ఆమెకు సూచించాడు. చివరికి ఏప్రిల్‌లో డానిష్ సాయంతో ఆమె పాక్ వీసా పొందింది. ఆ తర్వాత అతడికి పెళ్ళైనట్లు ఆమె గుర్తించింది.
మరోవైపు డానిష్ ఆమెను మెల్లగా గూఢచర్యానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. సైనిక స్థావరాల సమాచారాలు అడిగేవాడు. ఆ తర్వాత నగదు లావాదేవీలు కూడా నడిపాడు. డానిష్ నెంబర్ గజాలా ఫోన్‌లో ‘హ్యాపీనెస్’ అనే పేరుతో సేవ్ చేసుకొన్నట్లు గుర్తించారు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢచర్యానికి వాడుకొనేవాడు. యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్ళగా ఆమెను.. అతడు ట్రాప్ చేశాడు.